MachilipatnamLocal News
October 17, 2026
విద్య - ఉపాధి

కృష్ణా విశ్వవిద్యాలయంలో NEP సారథి ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధిపై అవగాహన సదస్సు

  • September 26, 2026
  • 1 min read
కృష్ణా విశ్వవిద్యాలయంలో NEP సారథి ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధిపై అవగాహన సదస్సు

మచిలీపట్నం:

జాతీయ విద్యా విధానం (NEP)-2020 లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, కెరీర్ సన్నద్ధత మరియు ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేందుకు శనివారం విశ్వవిద్యాలయ ఫార్మాస్యూటికల్ కళాశాలలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ‘NEP సారథి’ కార్యక్రమాల్లో భాగంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. విద్యార్థులు భవిష్యత్ కెరీర్‌లో రాణించడానికి అవసరమైన ప్రాథమిక అంశాలు, వృత్తిపరమైన సామర్థ్యాల పెంపుదల మరియు ఉపాధి అవకాశాల సాధనపై ఈ సందర్భంగా పలువురు ఆచార్యులు సుదీర్ఘంగా మార్గదర్శనం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ పి.వి. బ్రహ్మచారి విద్యార్థులకు రెజ్యూమ్ రైటింగ్‌పై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఉద్యోగ అవకాశాలను దక్కించుకోవడంలో సమర్థవంతమైన మరియు వృత్తిపరమైన రెజ్యూమ్‌ పాత్ర అత్యంత కీలకమని, దాన్ని రూపొందించుకునే విధానాన్ని ఆయన సవివరంగా వివరించారు. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. బాబు రెడ్డి మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో కేవలం విద్యార్హతలే సరిపోవని, ప్రతి ఒక్కరూ కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.

కృష్ణా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సహాయ ఆచార్యులు డాక్టర్ అమల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఉపాధి నైపుణ్యాలకు సంబంధించిన పలు విషయాలను తెలుసుకున్నారు.

About Author

SSN