సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఐ కేర్ సెంటర్ ప్రారంభం
గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్
ఐ కేర్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన సువెన్ లైఫ్ సైన్సెస్ చైర్మన్ వెంకట్ జాస్తికి ముఖ్యమంత్రి అభినందన
గుడ్లవల్లేరు:
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరులో జాస్తి సుబ్బారావు, పోలవరపు సత్యనారాయణ స్మారక ఎల్వీ ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఫౌండర్ చైర్మన్ జీఎన్ రావులతో కలిసి ఈ ఐ కేర్ సెంటర్ ను సీఎం ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న కంటి ఆస్పత్రులు స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ ఐ కేర్ సెంటర్ ఏర్పాటుకు సహకారం అందించిన సువెన్ లైఫ్ సైన్సెస్ సంస్థ చైర్మన్ జాస్తి వెంకట్ ను సీఎం అభినందించారు. సమాజానికి తిరిగి ఇవ్వాలన్న లక్ష్యంతో జాస్తి వెంకట్ ఈ ఐ కేర్ సెంటర్ కు ఆర్ధిక సహకారాన్ని అందించారని, ఈ ప్రాంతంలో పేదలకు సైతం ఉత్తమ నేత్ర వైద్యం అందుతుందని సీఎం అన్నారు.
ఈ ఐ కేర్ సెంటర్ కు ఏడాదికి 50 వేల మంది అవుట్ పేషెంట్లను పరీక్షించే అవకాశం ఉందని 5 వేల వరకూ శస్త్ర చికిత్సలు నిర్వహించే సామర్ధ్యంతో ఏర్పాటు చేయటం సంతోషదాయకమని ముఖ్యమంత్రి అన్నారు. ఏపీ తెలంగాణా, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో సేవలందిస్తున్న ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ లాభాపేక్ష లేకుండా సేవలందిస్తోందని సీఎం కొనియాడారు. ప్రజలకు సంక్షేమం- అభివృద్ధితో పాటు ఆరోగ్యానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. గత బడ్జెట్ కంటే ఈసారి వైద్యారోగ్యానికి రూ.19,305 కోట్లను కేటాయించామని తెలిపారు.
కంటి చికిత్సల విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ఈ ఏడాది 4 లక్షల కేటరాక్ట్ సర్జరీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పాఠశాల విద్యార్ధులకు కూడా ఐ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం వివరించారు. ప్రభుత్వం చేపట్టిన సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులతో మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎం తెలియచేశారు. అంతకు ముందు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు ఐ కేర్ సెంటర్ లోని వివిధ విభాగాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఆస్పత్రిలోని ఆధునాతన కంటి పరీక్షా యంత్రం వద్ద సీఎం కంటిని వైద్యులు పరీక్షించారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్ లోని వైద్యులు, సిబ్బందితో పాటు సువెన్ లైఫ్ సైన్సెస్ చైర్మన్ జాస్తి వెంకట్ కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి గ్రూప్ ఫోటో దిగి ఆప్యాయంగా పలకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు, సంస్థ వైస్ చైర్మన్ రాజీవ్ రెడ్డి, నెట్వర్క్ డైరెక్టర్ రోహిత్ ఖన్నా, ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్, మచిలీపట్నం ఆర్డిఓ సాంబశివరావు, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ట్రస్ట్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ సతీష్, తహసిల్దారు హరినాథ్ తదితర అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

