భవిష్యత్ ను అంచనా వేయడం అవసరం – ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయభాస్కరరావు
- కెయూ లో సాఫల్య దినోత్సవం
- విద్యార్ధులకు నియామక పత్రాలు
- తల్లి, తండ్రుల మోములో ఆనందభాష్పాలు
మచిలీపట్నం :
కృష్ణా విశ్వవిద్యాలయం లో అచ్చీవర్స్ డే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రాంగణ ఎంపికల్లో అర్హత సాధించిన ఇంజనీరింగ్, ఫార్మసీ చివరి సెమిస్టర్ పూర్తి చేసుకుంటున్న విద్యార్ధులకు వారి తల్లి తండ్రుల చేతుల మీదుగా శుక్రవారం సాఫల్య దినోత్సవ కార్యక్రమంలో నియామక పత్రాలు అందచేశారు. కృష్ణా యూనివర్సిటీలో ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థులు 100% ఉద్యోగ అవకాశాలు సాధించిన క్రమంలో విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను విశ్వవిద్యాలయ ప్రాంగణానికి ఆహ్వానించి ఘనంగా సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఎస్ విజయభాస్కరరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్ ను అంచనా వేస్తూ తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు. డిగ్రీ సంపాదించి బయటకు వెళ్లడం ప్రతి విద్యార్థికి పరిపాటేనని కానీ ఏదైనా ఒక ఉద్యోగ అవకాశం తో బయటకు వెళితే తమ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచిన వారవుతారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం లేకుండా బయటకు వెళితే ఎదుర్కొనే కష్టాలను సవివరంగా వివరించారు. మరో అతిథిగా విచ్చేసిన బెల్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ బి వి. నాగరాజు మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితులకు తను ఉద్యోగం సాధించిన నాటి పరిస్థితులను బేరీజు వేసి నేటి పరిస్థితుల్లో ఉద్యోగ అవకాశం యొక్క ఆవశ్యకతను విద్యార్థుల మనసులో నాటుకునేలా విశ్లేషించారు.
ఉపకులపతి ఆచార్య కె రాoజీ మాట్లాడుతూ విద్యార్థులకు డిగ్రీ కన్నా ముఖ్యం సాంకేతిక పరిజ్ఞానoతో కూడిన భావ వ్యక్తీకరణ అని, కాబట్టి ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని వారాలపాటు ఇంజనీరింగ్ , ఫార్మసీ ఆఖరి సంవత్సరం విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కొరకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, దాని ఫలితంగానే ఈరోజు నూరు శాతం ఉద్యోగ అవకాశాలు సాధించడానికి మార్గం సుగమం అయిందని చెప్పారు.
వర్సిటీ ఉపాధి, ఉద్యోగ అవకాశాల డైరెక్టర్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య వైకే సుందర కృష్ణ మాట్లాడుతూ సి ఎస్ ఈ విభాగం లో మొత్తం134 మందికి, ఈసీఈ లో 57 మందికి, ఫార్మసీ నుండి 105 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించడం, అదే సమయంలో ఈ విద్యార్థులంతా వాళ్ళ తల్లిదండ్రులను ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి వాళ్ల చేతుల మీదగా ఈ ఆఫర్ లెటర్స్ అందుకోవడం మిక్కిలి సంతోషంగా ఉందని చెప్పారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష మాట్లాడుతూ ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం 100% ఉద్యోగ అవకాశాలు వచ్చేలా మా వంతు ప్రయత్నం చేసి వర్సిటీని పేరొందిన యూనివర్సిటీల సరసన చేరేవరకు కృషి చేస్తామన్నారు. విశ్వవిద్యాలయం నుండి చదువు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం సాధించి బయటకు వస్తున్న విద్యార్ధుల తల్లి తండ్రుల మోములో ఆనందభాష్పాలు స్పష్టంగా కనిపించాయి.
ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రాంబాబు, వర్సిటీలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల ట్రైనింగ్, ప్లేస్మెంట్ ఇన్చార్జులు కే జీ వెంకటకృష్ణ, డా. అలీమీర్జా, డా. హనుమంతరావు, బోధనా, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

