మచిలీపట్నం:
పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తున్నాయని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు.
మంగళవారం కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఆయన జిల్లా పరిశ్రమలు ఎగుమతులు ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించి, జిల్లాలో పరిశ్రమల స్థాపన, పురోగతిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరుతూ, వారికి అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ డెస్క్ పాలసీ కింద మంజూరు చేయడమే కాకుండా ప్రభుత్వ రాయితీలు అందిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. సింగిల్ డెస్క్ పాలసీ కింద జిల్లాలో మొత్తం 628 దరఖాస్తులు రాగా, అందులో 606 దరఖాస్తులకు అన్ని రకాల అనుమతులు మంజూరు చేసి ఆమోదించామన్నారు. పెండింగ్‌లో ఉన్న 22 దరఖాస్తులను తక్షణం పరిశీలించి పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తూ, పెట్టుబడిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
సమావేశంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్ వెంకట్రావు, అగ్నిమాపక శాఖ అధికారి ఏసురత్నం, రహదారులు భవనాలు శాఖ ఈఈ లోకేశ్వరరావు, జిల్లా రిజిస్ట్రార్ గోపాలకృష్ణ, భూగర్భ జల శాఖ ఏడీ బిందుశ్రీ, మచిలీపట్నం నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, విద్యుత్, సాంఘిక సంక్షేమ తదితర శాఖల అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.