MachilipatnamLocal News
June 11, 2026
జిల్లా

స్థానిక సంస్థల్లో బీసీల రాజకీయ ప్రాతినిధ్యంపై అభిప్రాయాలు స్వీకరించిన అంకిత (డెడికేటెడ్) కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా

  • June 10, 2026
  • 1 min read
[addtoany]
స్థానిక సంస్థల్లో బీసీల రాజకీయ ప్రాతినిధ్యంపై అభిప్రాయాలు స్వీకరించిన అంకిత (డెడికేటెడ్) కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా

మచిలీపట్నం:

స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్ల ప్రభావం, సామాజిక-ఆర్థిక పరిస్థితులు ఇతర సంబంధిత అంశాలపై వివిధ వర్గాల అభిప్రాయాలు, సూచనలు, వినతిపత్రాలను రాష్ట్ర ప్రభుత్వ అంకిత (డెడికేటెడ్) కమిషన్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా స్వీకరించారు.

బుధవారం ఉదయం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి పాల్గొన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీసీ సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజా సంఘాలు, మేధావులు ఇతర సంబంధిత వర్గాల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలు, వ్యక్తిగత సూచనలు, వినతిపత్రాలు, లిఖితపూర్వక నివేదికలను కమిషన్ చైర్మన్‌కు నేరుగా సమర్పించారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పిస్తున్న రాజకీయ రిజర్వేషన్ల అమలు, వాటి ప్రభావం, సామాజిక ఆర్థిక పరిస్థితులు, ప్రజా ప్రాతినిధ్యానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అందిన వినతులు, సూచనలను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు కమిషన్ చైర్మన్ తెలిపారు.

పర్యటనలో భాగంగా సమావేశం అనంతరం అంకిత కమిషన్ చైర్మన్ క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం కంకిపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.

అర్జీలలో కొన్ని:

ముదిరాజ్ సంఘం కృష్ణాజిల్లా అధ్యక్షుడు కొమటి శ్రీనివాసరావు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు వినతిపత్రం సమర్పించారు. ముదిరాజ్ కులస్తులకు జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు, బీసీ-డీ నుంచి బీసీ-ఏ గ్రూపులోకి మార్పు, ఉచిత విద్య, భూమి, ఉచిత విద్యుత్, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అలాగే ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు, బ్యాటరీ వాహనాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

బీసీ సంక్షేమ సంఘం కృష్ణాజిల్లా అధ్యక్షుడు శేకుబోయిన సుబ్రమణ్యం డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ కు వినతిపత్రం సమర్పించారు. బీసీలకు చట్టసభల్లో శాశ్వత రిజర్వేషన్లు కల్పించడంతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 44 శాతానికి పెంచాలని కోరారు. అలాగే క్రీమీ లేయర్ విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లలో రిజర్వేషన్లు, బీసీల రక్షణ చట్టం, కుల గణన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బీసీ కులాలకు కార్పొరేషన్ చైర్మన్ల నియామకం చేపట్టాలని కూడా కోరారు.

ఏపీ బైండ్ల సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ కమిషనర్‌గా ఉన్న సమయంలో బైండ్ల కులానికి ప్రత్యేక గుర్తింపు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది బైండ్ల కులస్తులు ఉన్నారని పేర్కొంటూ, వారి పిల్లల విద్య, ఉద్యోగ అవకాశాల కోసం ఎస్సీ బైండ్ల కుల ధ్రువీకరణ పత్రాలను ఎటువంటి ఆంక్షలు లేకుండా జారీ చేయాలని, పాత ధ్రువీకరణ పత్రాల మార్పిడి ప్రక్రియను సులభతరం చేయాలని కోరారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీ రాష్ట్ర నూర్‌బాషా/దూదేకుల సహకార ఆర్థిక సంస్థ డైరెక్టర్ షేక్ బాలాజీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ కు వినతిపత్రం సమర్పించారు. నూర్‌బాషా/దూదేకుల వర్గం ఆర్థిక, సామాజికంగా వెనుకబడి ఉందని పేర్కొంటూ, ప్రస్తుతం ఉన్న బీసీ-బీ వర్గం నుంచి బీసీ-ఏ (అత్యంత వెనుకబడిన వర్గం)లోకి మార్చాలని కోరారు. సంప్రదాయ వృత్తులు కనుమరుగవుతున్న నేపథ్యంలో ప్రత్యేక ఆర్థిక సహాయం, సబ్సిడీ రుణాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే స్థానిక సంస్థలు, రాజకీయ నిర్ణయాత్మక వేదికల్లో నూర్‌బాషా/దూదేకుల వర్గానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.

సమావేశంలో డీఆర్వో (ఇన్‌చార్జి) పి పోతురాజు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం సాధికారిత అధికారి జి. రమేష్, జడ్పీ సీఈవో డాక్టర్ జే అరుణ, డిపిఓ ధనలక్ష్మి, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేంద్రబాబు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి షేక్ షాహిద్ బాబు, మచిలీపట్నం నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, ఎంపీడీవోలు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author

SSN