MachilipatnamLocal News
June 12, 2026
జిల్లా

ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్) 2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: ఆర్‌డీవో సాంబశివరావు

  • June 12, 2026
  • 1 min read
[addtoany]
ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్) 2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: ఆర్‌డీవో సాంబశివరావు

మచిలీపట్నం:

భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్) 2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఓటరు సహకరించాలని ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్వో) 75-మచిలీపట్టణం అసెంబ్లీ నియోజకవర్గం, బందరు ఆర్డీవో కే సాంబశివరావు కోరారు. శుక్రవారం సాయంత్రం ఆయన మచిలీపట్నం ఉత్తర మండల తహసిల్దార్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఎన్నికల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణపై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం జూన్ 15 నుండి జూలై 14, 2026 వరకు బూత్ స్థాయి అధికారులు (బిఎల్ఓలు) ఇంటింటికి వెళ్లి ప్రీ-ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫారమ్‌లను పంపిణీ చేసి తిరిగి సేకరిస్తారని తెలిపారు. ఈ ప్రక్రియలో ఓటర్ల నుంచి ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేదా ఇతర డాక్యుమెంట్లు తీసుకోరని స్పష్టం చేశారు. ఓటర్లు తమ వివరాలను పూర్తిగా నింపి బిఎల్ఓలకు అందజేయాలని, లేదా ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలని సూచించారు. అందిన ఎన్యూమరేషన్ ఫారమ్‌ల ఆధారంగానే ముసాయిదా ఓటరు జాబితా రూపొందించబడుతుందని, ఫారమ్‌లు సమర్పించని వారి పేర్లు ముసాయిదా జాబితాలో ఉండవని తెలిపారు.

ఓటర్లు తమ లేదా తమ కుటుంబ సభ్యుల వివరాలను 2002 ప్రత్యేక సమగ్ర సవరణ ఓటరు జాబితాలతో అనుసంధానం చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు. ఇందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన లింక్‌ను వినియోగించుకోవచ్చని, అలాగే 2002 ఓటరు జాబితాలు జిల్లా వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. జూలై 21, 2026న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించబడుతుందని, అనంతరం జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. ఈ కాలంలో అందిన దరఖాస్తులపై సమగ్ర విచారణ నిర్వహించి అర్హులైన వారందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

2002 ఓటరు జాబితాలతో అనుసంధానం కాని లేదా వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న వ్యక్తులకు ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో) నోటీసులు జారీ చేస్తారని, ఆ జాబితాలను ప్రజల పరిశీలన కోసం స్థానిక సంస్థల కార్యాలయాలు, ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా ఎన్నికల అధికారి వెబ్‌సైట్లలో ప్రదర్శిస్తారని వివరించారు. ముసాయిదా ఓటరు జాబితాలో ఉన్న ఏ ఓటరి పేరునైనా పూర్తి విచారణ జరపకుండా తొలగించే అవకాశం లేదని, ప్రతి వ్యక్తికి తన వాదనలు వినిపించే న్యాయసమ్మతమైన అవకాశం కల్పించబడుతుందని ఆర్డీవో తెలిపారు.
అలాగే 18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువత ఓటరుగా నమోదు కావడానికి ఆన్‌లైన్ ద్వారా లేదా ఫారం-6తో పాటు అవసరమైన పత్రాలను బిఎల్ఓ లేదా సంబంధిత తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని, BLOలు మరియు బూత్ లెవెల్ ఏజెంట్లు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ప్రతి అర్హ ఓటరు తన ఎన్యూమరేషన్ ఫారమ్‌ను తప్పనిసరిగా పూర్తి చేసి సమర్పించి, ఓటరు జాబితాలో తన పేరు కొనసాగింపునకు సహకరించాలని ఆర్డీవో విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో మచిలీపట్నం ఉత్తర, దక్షిణ మండలాల తహసిల్దార్లు వి నాగభూషణం, కే రామ శివ, రెవిన్యూ ఇన్స్పెక్టర్ చోడవరపు చంద్రశేఖర్ పాల్గొన్నారు.

About Author

SSN