జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నేర రహిత సమాజమే లక్ష్యంగా పోలీస్ & శక్తి టీమ్స్ కార్యాచరణ
జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు మరియు కళాశాలల్లో విద్యార్థుల భద్రతే ధ్యేయంగా పోలీస్ అధికారులు మరియు శక్తి టీమ్స్ సంయుక్తంగా భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు బందర్ డిఎస్పి సిహెచ్ రాజా గారు శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల నందు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు
బాలికల రక్షణ & పోక్సో (POCSO) చట్టం:
బాలికలు తమపై జరిగే ఎలాంటి వేధింపులనైనా మౌనంగా భరించకూడదని, అపరిచిత వ్యక్తుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేధింపులకు గురైతే పోక్సో చట్టం కింద నిందితులకు పడే కఠిన శిక్షల గురించి వివరిస్తూ, బాధితులకు చట్టం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సోషల్ మీడియా వినియోగం – జాగ్రత్తలు
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగంపై విద్యార్థులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అపరిచితులతో స్నేహం చేయడం, వ్యక్తిగత ఫోటోలు, సమాచారం పంచుకోవడం వంటివి ప్రమాదకరమని వివరించారు. సామాజిక మాధ్యమాలను కేవలం విజ్ఞానం కోసం మాత్రమే వాడాలని, సైబర్ వేధింపులకు గురైతే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
రోడ్డు భద్రత:
రహదారి నిబంధనలు పాటించడం పౌరుల బాధ్యత అని, ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. హెల్మెట్ ధరించడం మరియు ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు.
బాల్య వివాహాల నిర్మూలన
చదువుకోవాల్సిన వయసులో బాలికలకు పెళ్లిళ్లు చేయడం నేరమని, అటువంటి ఘటనలు ఎక్కడ జరిగినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
మత్తు పదార్థాల నియంత్రణ (Anti-Drugs)
యువత డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో కూడిన లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని హితవు పలికారు.
అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు
ఏదైనా ఆపద లేదా అత్యవసర పరిస్థితిలో 112 నంబర్‌ను సంప్రదించాలి.
మత్తు పదార్థాల రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే 1972 నంబర్‌కు తెలియజేయాలి.
సైబర్ నేరాలకు గురైతే ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి.