MachilipatnamLocal News
March 5, 2026
జిల్లా

జిల్లాలో పరిశ్రమల స్థాపనకున్న అడ్డంకలు తొలగిస్తాం : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • March 5, 2026
  • 0 min read
[addtoany]
జిల్లాలో పరిశ్రమల స్థాపనకున్న అడ్డంకలు తొలగిస్తాం : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం :
 
జిల్లాలో పరిశ్రమలకు ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిస్తామని పారిశ్రామికవేత్తలు సత్వరమే వారి యూనిట్లు స్థాపించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు.
 
గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ పెనమలూరు మండలంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల సమావేశం మందిరంలో పరిశ్రమల స్థాపన… సంబంధిత సమస్యలు అనే అంశంపై సంబంధిత అధికారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మల్లవల్లి, వీరపునేనిగూడెం పారిశ్రామిక వాడలలో పరిశ్రమలు నెలకొల్పుటకు పారిశ్రామికవేత్తలకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు తమకు కేటాయించిన స్థలాలు లోతట్టుగా ఉన్నాయని వాటిని మెరక చేయుటకు మట్టి అవసరం ఉందని చెప్పారు. మట్టి దూర ప్రాంతం నుంచి తెచ్చుకోవడం వలన ఖర్చు అధికంగా ఉందని చెప్పారు.
 
పారిశ్రామిక వాడలో సరైన భద్రత లేదని, వాచ్మెన్ సరిగా విధుల్లో ఉండటం లేదని, వీధి దీపాలు వెలగడం లేదని, తాము తెచ్చుకున్న సామాగ్రి చోరీకి గురవుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. రహదారేమో ఎత్తులో ఉందని మురుగునీటి వ్యవస్థ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదన్నారు.
దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ అధికారుల బృందం ఆ ప్రాంతాలను పరిశీలించి సమీపంలో ఎక్కడ నుంచి మట్టి తోలుకునేందుకు అవకాశం ఉందో చూసి పారిశ్రామికవేత్తలకు అనుమతించాలన్నారు.
ప్రస్తుతం ఉన్న వాచ్మెన్ సరిగా విధుల్లో లేని కారణంగా అతనిని తొలగించి అతని స్థానంలో ఇంకొకరిని నియమించాలని, అతని విధులను పర్యవేక్షించాలని సూచించారు. అంతేకాకుండా వీధి దీపాలు కూడా వెలిగేలా చూడాలని స్పష్టం చేశారు. సామాగ్రి దొంగలించకపోకుండా భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలన్నారు.
 
కొందరేమో తమకు కేటాయించిన స్థలము యూనిట్ నెలకొల్పుటకు సరిపోవటం లేదని, తాము కోరినంత స్థలము ఇవ్వలేదని, అందుకు బదులుగా వేరే స్థలం కేటాయించాలని కోరుతూ అవసరమైతే అదనంగా సొమ్ము చెల్లిస్తామని చెప్పడం జరిగింది . దీంతో కలెక్టర్ వెంటనే స్పందిస్తూ వారి అభ్యర్థనను ఒకసారి మరల పరిశీలించి ప్రస్తుతం ఉన్న స్థలాన్ని రద్దుచేసి దాని స్థానంలో వారు కోరినంత స్థలము ఇచ్చే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.
 
మరి కొంతమంది పారిశ్రామికవేత్తలు వారు నెలకొల్పాలనుకున్న యూనిట్లకు సంబంధించి బ్యాంకు రుణాలు కోసం పదేపదే తిరగాల్సి వస్తుందని, రుణం మంజూరు చేయడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. దరఖాస్తులో ఉన్న లోటుపాట్లు ఒకేసారి చెప్పకుండా ఒక్కోసారి ఒక్కొక్క తప్పును చెబుతూ కాలయాపన చేస్తున్నారన్నారు.
 
దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ సంబంధిత పారిశ్రామికవేత్తల దరఖాస్తు వివరాలను స్వయంగా రాసుకుని సంబంధిత బ్యాంక్ అధికారులతో మాట్లాడుతామని చెప్పారు. అంతేకాకుండా ఈ నెల13 వ తేదీన బ్యాంక్ అధికారుల సమావేశం నిర్వహిస్తున్నామని , బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారవేత్తల వివరాలను గూగుల్ స్ప్రెడ్షీట్లో సేకరించి ముందుగానే బ్యాంకులకు పంపడం జరుగుతుందన్నారు. సమావేశం రోజున రుణాల గురించి విచారిస్తామన్నారు.
 
కొందరు పారిశ్రామికవేత్తలు డాక్యుమెంట్ల ప్రకారం తమకు కేటాయించిన స్థల విస్తీర్ణం వాస్తవంగా భూమిపైన లేదని సరిహద్దుల సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. 
జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ సర్వేయర్ ను అక్కడికి పంపించి కొలతలు కొలిచి సరి చేయాలని సూచించారు.
 
ఈ సమావేశంలో ఏపీఐఐసీ జడ్ఎం బాబ్జి, డిఐసి జిఎం వెంకటరావు, జిల్లా ఉద్యాన అధికారి జే జ్యోతి, ప్రత్యేక అధికారులు జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకటరావు, మార్కెటింగ్ ఎడి నిత్యానందం, డి సి ఓ చంద్రశేఖరు, ఆర్టీవో ఎన్ యు ఎన్ ఎస్ శ్రీనివాసరావు, డి ఎల్ డి వో లు సునీత శర్మ, రాజేష్ గనుల శాఖ ఏజీ కొండారెడ్డి పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *