తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ జరిగిందా ? ప్రభుత్వం ఏం చెబుతుంది ?
SSN
- February 10, 2026
- 1 min read
మచిలీపట్నం:
రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం తిరుపతి లడ్డులోని నెయ్యి స్వచ్ఛత. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డు వివాదంపై ప్రముఖ న్యూస్ వెబ్ సైట్ ది వైర్ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం వివరాలు ఇలా ఉన్నాయి.
టీటీడీ నెయ్యి కొనుగోలు, నాణ్యత కు సంబంధించి విచారణ జరిపేందుకు 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), ఇటీవల తన అనుబంధ చార్జిషీట్(నెం. 01/2025)ను సమర్పించింది.
దర్యాప్తు ప్రకారం, లడ్డూల తయారీలో ఉపయోగించాల్సిన “అగ్‌మార్క్ స్పెషల్ గ్రేడ్” ఆవు నెయ్యికి బదులుగా కల్తీ నెయ్యి సరఫరా 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైంది.
చార్జిషీట్ స్పష్టంగా 2019 ఫిబ్రవరి 18వ తేదీని కల్తీకి మూలంగా గుర్తించింది. ఆ సమయంలో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉంది.
చార్జిషీట్ పత్రాల ప్రకారం, టీటీడీ సాంకేతిక బృందం ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఉన్న ప్రీమియర్ అగ్రి ప్లాంట్‌ను మూడుసార్లు తనిఖీ చేసింది: నవంబర్ 5, 2017 (టీడీపీ ప్రభుత్వ హయాంలో), ఆగస్టు 7, 2019 (వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దికాలానికే) మరియు నవంబర్ 18, 2023 (ఇది కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే).
నిందితులు శుద్ధి చేసిన పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్‌ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారనీ, ఈ నూనెలు వాసన, రంగు మరియు రసాయనాలు, నెయ్యిలా కనిపించడానికి పసుపు రంగు కోసం బీటా-కెరోటిన్, వాసన కోసం నెయ్యి ఫ్లేవర్, మరియు ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్, లాక్టిక్ యాసిడ్ మరియు మోనోగ్లిజరైడ్స్‌తో వంటి రసాయనాలను ఉపయోగించి ఉండవచ్చని చార్జిషీట్ పేర్కొంది.
సిట్ తన తొలి ప్రాథమిక ఛార్జ్ షీట్ లో నెయ్యి కల్తీ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేసింది. అయితే అది జంతువుల కొవ్వు కాదని, సింథటిక్ నెయ్యి అనీ అది కూడా ఫిబ్రవరి 2019 నాటికే టీటీడీ కి సరఫరా అవుతుందని స్పష్టం చేసింది.
అయితే సున్నితమైన, మతపరమైన విశ్వాసాలతో కూడిన ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తూ…టీటీడీ లడ్డు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, బాత్రూమ్ క్లీనర్ కెమికల్స్ ఉన్నాయనీ… ఇంకా విచారణ పూర్తి కాని అంశం పై ఖచ్చితత్వాన్ని ప్రకటించడం దురదృష్టకరం.
ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలైన తెలుగు దేశం, జనసేన నిరూపితం కాని అంశాన్ని (జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని) బలంగా జనం మస్తిష్కాలలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నా… బీజేపీ మాత్రం మొదటి నుంచి ఈ వివాదానికి కొంత దూరం పాటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది.
బాబు & కో ఆరోపణలు
నిజంగా బాబు & కో ఆరోపిస్తున్నట్లుగా నెయ్యి లో జంతువుల కొవ్వు కలిసినట్లైతే, ప్రభుత్వం ఆ విషయాన్ని శాస్త్రీయ ఆధారాలతో నిరూపించి, నిందుతులకు చట్ట పరిధిలో శిక్ష పడేలా చేయాలి. రాజకీయాలలో సుదీర్ఘ అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబుకి… మతవిశ్వాసాలతో రాజకీయం చేయడం వల్ల శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లుతుందని తెలియనిది కాదు!
లడ్డు కేంద్రంగా జరుగుతున్న ఈ రాజకీయ క్రీడ రోజుకో మలుపు తిరుగుతూ ఒక వర్గం మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తప్పు జరిగింది అని పదే పదే ప్రస్తావిస్తూ ఘటన మూలాలను వదిలి, ప్రభుత్వం కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం అవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ప్రతిపక్ష వైసీపీకి వ్యతిరేకంగా రాష్ట్రం లో పలు చోట్ల బ్యానర్లు వెలిసి, విద్వేషాలు రగులుతున్నా… ప్రభుత్వం మాత్రం ఉదాసీనంగా వ్యవహారిస్తుంది. దాంతో లడ్డు వివాదం ప్రాతిపదికగా వైసీపీ నాయకులను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందా అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు సాగుతున్నాయి.
ఈ సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ని చూసినప్పుడు విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి లోని 35వ కవిత గుర్తుకొస్తుంది.
“Where the mind is without fear and the head is held high;
Where knowledge is free;
Where the world has not been broken up into fragments by narrow domestic walls;
Where words come out from the depth of truth;
Where tireless striving stretches its arms towards perfection;
Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit;
Where the mind is led forward by thee into ever-widening thought and action—
Into that heaven of freedom, my Father, let my country awake.”
మనిషి భయం లేకుండా, ఆత్మగౌరవంతో తల ఎత్తుకుని బ్రతికే సమాజం కావాలనీ,
విద్య అనేది కేవలం ధనవంతులకు లేదా ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాకుండా, అందరికీ అందుబాటులో ఉండాలనీ,
కులం, మతం, ప్రాంతం వంటి గోడల మధ్య లోకం ముక్కలు కాకూడదనీ,
మన ఆలోచనలు మూఢనమ్మకాలనే ఎడారిలో కలిసిపోకుండా, హేతుబద్ధంగా ఉండాలనీ,
నిజమైన స్వేచ్ఛ అంటే కేవలం రాజకీయ స్వాతంత్య్రం మాత్రమే కాదు, అది మానసిక మరియు ఆధ్యాత్మిక వికాసం కూడా అనీ జనగణమన రచయిత రవీంద్రనాధ్ ఠాగూర్ కోరుకున్నారు.
శ్యామ్ కాగిత,
మచిలీపట్నం

