మచిలీపట్నం, 9 మార్చి 2026, SSN:
మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రానున్న రోజుల్లో జరిగే పంచాయతీ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కొల్లు రవీంద్ర పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అధికారాన్ని కోల్పోయిన వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజల్లోకి వెళ్లి సమర్థంగా ఎదుర్కోవాలని, సోషల్ మీడియాలో జరుగుతున్న అపప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టాలని మంత్రి సూచించారు. ప్రజలకు నిజాలను తెలియజేసేలా పార్టీ నాయకులు చురుకుగా పని చేయాలని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో డ్రైనేజ్, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. అదేవిధంగా పార్టీ ఇంచార్జీలు గ్రామాలు, వార్డుల్లోకి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్–6 హామీలు, సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రి కొల్లు రవీంద్ర దిశానిర్దేశం చేశారు.
ఇకపోతే టౌన్, రూరల్ అనుబంధ సంఘాల నియామకాలు, అంతర్గతంగా కేఎస్ఎస్ల నియామకం తదితర పార్టీ వ్యవహారాలపై కూడా సమావేశంలో చర్చించారు. పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొనకళ్ళ జగన్నాథరావు (బుల్లయ్య), జిల్లా పార్టీ కార్యదర్శి గోపు సత్యనారాయణ, మార్కెటింగ్ యాడ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని, కార్పొరేటర్లు మరకాని సమతా కీర్తి, దేవరపల్లి అనిత, దింతకుర్తి సుధాకర్, అన్నం ఆనంద్, చిత్తజల్లు నాగరాము, పార్టీ నాయకులు, క్లస్టర్ ఇంచార్జీలు తదితరులు పాల్గొన్నారు.