[addtoany]
మచిలీపట్నం:
జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థిని విద్యార్థులు తప్పుదారి పట్టకుండా మంచి చెడుల వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలసి వారి చాంబర్లో బాలబాలికలు, యువత భద్రతపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రాను రాను యువత వ్యవహార శైలి చాలా మార్పు చెంది తప్పుదారి పడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా బాల్య దశలోనే బాలికలకు మంచిగా తాకడం, చెడుగా తాకడం( గుడ్ టచ్, బ్యాడ్ టచ్) వంటి విషయాల పైన సరైన అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో ఉండే విద్యార్థులకు నూటికి నూరు శాతం అర్థమయ్యే విధంగా వాటి గురించి వివరించాలన్నారు. తొందరపాటు చర్యతో ముందస్తు గర్భధారణ వలన కలిగే ఇబ్బందులు విశదంగా తెలియజేయాలన్నారు. అంతే కాకుండా బాల్య వివాహాలు కూడా చేసుకోరాదని దాని వలన కలిగే నష్టాలను, ఆరోగ్య సమస్యలను వివరించాలన్నారు.
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ
తల్లిదండ్రులకు తమ పిల్లలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో వారు తప్పుదారి పడుతున్నారన్నారు.
ముఖ్యంగా బాలికలు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. జిల్లా విద్యాధికారీ వారానికి 3 రోజుల చొప్పున 10 రోజుల షెడ్యూల్ తయారు చేయాలని ఆ షెడ్యూల్ ప్రకారము విద్యా, వైద్య , పోలీసు తదితర సంబంధిత శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులలో కూడా మార్పు రావాలని తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు వారు తోడ్పడే విధంగా జిల్లా యంత్రాంగంతో సహకరించాలన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం లో విద్యార్థుల బాగోగుల గురించి సరైన అవగాహన కలిగించాలన్నారు.
వసతి గృహాలకు సెలవులు ఇచ్చినప్పుడు విద్యార్థులు వారి స్వగ్రామం వెళ్లే ముందు తల్లిదండ్రుల సమక్షంలో ముందస్తు గర్భధారణ, ఫోక్సో చట్టం బాల్యవివాహాల నిరోధక చట్టం గురించి క్షుణ్ణంగా వివరించాలన్నారు. అధికారులందరూ చొరవ తీసుకొని సమన్వయంతో కొంతకాలం అవగాహన తరగతులు నిర్వహిస్తే ఫోక్సో, బాల్యవివాహాలు వంటి నేరాలు తగ్గుతాయన్నారు. చదువు అందరికీ ముఖ్యమని, బాలికలు మధ్యలో చదువును ఆపకుండా దాని యొక్క విలువను కూడా తెలియజేయాలన్నారు
బాలికలు గాని, యువతులుగాని ఎవరికైనా అవసరం అయితే 112 అనే హెల్ప్ లైన్ నెంబర్ కు గాని, 1098 చైల్డ్ కేర్ నెంబర్కు గాని ఫోన్ చేసి వారి ఇబ్బందులను తెలియజేయాలన్నారు అటువంటి వారికి రక్షణ కల్పించి అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి సరళ కుమారి, డీఈవో సుబ్బారావు, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, బీసీ సంక్షేమ సాధికారత అధికారి రమేష్ , కార్మిక శాఖ సహాయ కమిషనర్ విష్ణు, ఐసిడిఎస్ పీవో విజయలక్ష్మి, డి సి ఆర్ బి సి ఐ పెద్దిరాజు, ఇంటర్ విద్యాశాఖ ఏజీఎంసి నాగ రవి తదితర అధికారులు పాల్గొన్నారు.

