రోడ్డెక్కిన అధికార, ప్రతిపక్షాలు
SSN
- February 3, 2026
- 1 min read
జనవరి 31, 2026 న ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఉదయం నుంచి రెండు ప్రధాన రాజకీయ పక్షాల మధ్య వివాదాస్పద వ్యాఖ్యలతో మొదలైన శనివారం… సాయంకాలానికి ఆస్తుల ధ్వంసం, అరెస్టుల వరకు వెళ్లి రాష్ట్రం ఉలిక్కిపడేలా చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్న ఈ ఘటన మూలం ఒక్కసారి చూద్దాం!
ఫ్లెక్సీ బ్యానర్
గుంటూరులోని గోరంట్ల వద్ద భారీ ఫ్లెక్సీ వెలిసింది. దీనిపై మహాపాపం అని రాసి ఉండటంతో పాటు వైసీపీ నాయకత్వాన్ని, నాయకులను విమర్శిస్తూ వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ బ్యానర్ విషయం పైనే టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ మొదలై… అనుచిత వ్యాఖ్యలు, అరెస్టులకు దారి తీసింది.
అయితే ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు రెచ్చగొట్టే విధంగా బ్యానర్లు కట్టవచ్చా?
బ్యానర్ కట్టాలంటే నిబంధనలు ఉన్నాయా?
అనుమతులు తీసుకోవాలా?
బ్యానర్ల నియమ నిబంధనలు
ఎక్కడైనా బ్యానర్ కట్టాలంటే స్థానిక మున్సిపాలిటీ లేదా నగర పాలక సంస్థ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి పొందిన బ్యానర్లపై మున్సిపల్ హోలోగ్రామ్ లేదా క్యూఆర్ కోడ్ ఉండాలి.
ఎన్ని రోజుల వరకు ఆ బ్యానర్ అక్కడ ఉండాలో ముందే తెలపాలి. ప్రతి ఫ్లెక్సీ పైన ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా, కస్టమర్ పేరు, ఫోన్ నంబర్, అనుమతి పొందిన సీరియల్ నంబర్ ముద్రించబడి ఉండాలి.
ముఖ్యంగా ఫ్లెక్సీలపై వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మేటర్ ఉండకూడదు.
నిషేధిత ప్రాంతాలు
బ్యానర్లను కొన్ని ప్రాంతాల్లో కట్టకూడదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ అడ్డుగా ఉండేలా కట్టకూడదు. విద్యుత్ స్తంభాలు లేదా ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర, పాదచారులకు ఇబ్బంది కలిగించేలా ఫుట్‌పాత్‌లపై, ప్రభుత్వ కార్యాలయాలు, విగ్రహాల పైన బ్యానర్లు కట్టడం నిషిద్ధం.
నిబంధనలు ఉల్లంఘిస్తే
ఫ్లెక్సీలు, బ్యానర్లు మరియు ప్రకటనల బోర్డుల ఏర్పాటుకు సంబంధించి భారతదేశంలో బలమైన చట్టాలు, సెక్షన్లు ఉన్నాయి. వీటిని అతిక్రమిస్తే జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.
జరిమానాలు, శిక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్తించే ప్రధాన చట్టాలు
ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టం (AP Municipalities Act, 1965)
మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు కడితే ఈ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చు
అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలు, బ్యానర్లు కట్టడం చట్ట విరుద్ధం. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలిగితే భారీ జరిమానాలు విధించవచ్చు. ప్రకటనల పన్ను చెల్లించకుండా ఫ్లెక్సీలు వేయడం ఆర్థిక నేరం కిందకు వస్తుంది.
బహిరంగ ప్రదేశాల వికృతీకరణ నిరోధక చట్టం (Prevention of Disfigurement of Open Spaces Act)
ప్రభుత్వ ఆస్తులు, గోడలు లేదా విగ్రహాలపై ఫ్లెక్సీలు కట్టడం ఈ చట్టం ప్రకారం నేరం. ఈ చట్టం కింద నేరం రుజువైతే 3 నుండి 6 నెలల జైలు శిక్ష లేదా రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు జరిమానా (లేదా రెండు) విధించవచ్చు.
ఫ్లెక్సీల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగితే
భారతీయ శిక్షా స్మృతి (IPC) – ప్రస్తుత భారతీయ న్యాయ సంహిత (BNS)
సెక్షన్ 268 (Public Nuisance): ఫ్లెక్సీల వల్ల ప్రజలకు లేదా ట్రాఫిక్‌కు ఆటంకం కలిగితే ‘పబ్లిక్ న్యూసెన్స్’ కింద కేసు నమోదు చేయవచ్చు.
సెక్షన్ 153A: రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తించేలా (మతం, కులం లేదా రాజకీయంగా) ఫ్లెక్సీల్లో మేటర్ ఉంటే ఈ సెక్షన్ కింద నాన్-బైలబుల్ కేసు పెట్టవచ్చు.
సెక్షన్ 505: రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేదా తప్పుడు ప్రచారాలు ఫ్లెక్సీల ద్వారా చేస్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది.
హైకోర్టు మార్గదర్శకాలు
ఉమ్మడి హైకోర్టు మరియు ప్రస్తుత ఏపీ హైకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పుల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యేలా ఫ్లెక్సీలు కట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. మున్సిపల్ అధికారులు తమ విధి నిర్వహణలో ఫ్లెక్సీలను తొలగించకపోతే, ఆ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవచ్చు.
శ్యామ్ కాగిత,
మచిలీపట్నం

