మచిలీపట్నం :
జిల్లాలో రహదారి ప్రమాదాలను జరగకుండా నిరోధించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులు ఆదేశించారు.
సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో జిల్లాస్థాయి రహదారి భద్రత సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత నెలతో పోలిస్తే ఈ నెలలో ప్రమాదాలు చాలావరకు తగ్గాయన్నారు.
గత నెలలో 29 ప్రమాద సంఘటనలు జరుగగా 32 మంది చనిపోయారన్నారు. గన్నవరం ప్రాంతంలో గత నెల 18 వ తేదీ నాటికి 18 మంది చనిపోగా ఈ నెలలో 18వ తేదీ నాటికి 9 మంది మృత్యువాత పడ్డారన్నారు. రహదారులు ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నందున ఏ ఒక్కరూ ప్రాణం కోల్పోకుండా వేగనిరోధకాలు అవసరమైన చోటల్లా ఏర్పాటు చేయాలన్నారు.
ముఖ్యంగా జాతీయ రహదారులు 216, 65 మార్గాల్లో ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో వాహనాల వేగం తగ్గించేందుకు అవసరమైన డ్రమ్ములను ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా రహదారి మార్గంలో విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలన్నారు. డివైడర్ల మధ్యలో ఖాళీలు ఉండరాదని స్పష్టం చేస్తూ వాకర్ బ్రిడ్జిల దగ్గర ఫ్లెక్సీలు లేకుండా చూడాలని సీసీ కెమెరాలతో పాటు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగే ప్రదేశాలు రాకముందే 100 మీటర్ల ముందర రంబుల్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలన్నారు. బెల్ కంపెనీ వద్ద, గండిగుంట పెట్రోల్ బంకు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించినందున అక్కడ నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, అదనపు ఎస్పీ వివి నాయుడు, ఆర్టీవో శ్రీనివాసరావు, డిపిటివో వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, జాతీయ రహదారుల పిడి విద్యాసాగర్, మోర్త్ ఏఈ అనుదీప్, డిఎస్పి సిహెచ్ రాజా, సర్వ శిక్ష ఏపీసి కుమిదిని సింగ్, ఎంవిఐలు సిద్ధిక్, సుబ్బారావు, నారాయణస్వామి, సంగీతరావు, ఏఎంవిఐలు సోనిప్రియ అయిషా తదితర అధికారులు పాల్గొన్నారు.