బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసౌరి మచిలీపట్నంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ రోజు రోజుకీ బలపడుతూ కూటమిని మరింత శక్తివంతం చేస్తోందని, 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. బందర్ పార్లమెంట్ నియోజకవర్గం రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మొదటిగా చేజారే సీటు అవుతుందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ కోసం నిధులు తీసుకురావడంలో వైసీపీ నాయకులు అడ్డంకులు సృష్టించడం దురదృష్టకరమని మండిపడ్డారు. ప్రజల అభివృద్ధి కార్యక్రమాలకు రాజకీయాలు అడ్డంకి కాకూడదని ఆయన హితవు పలికారు.
జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నాలుగో డివిజన్ కార్పొరేటర్ ఛాయాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బందర్ జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణతో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి, పెద్ద ఎత్తున కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన శక్తి పెరుగుతోందని, ప్రజల మద్దతే తమకు అతిపెద్ద బలం అని వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు. 2029లో కూటమి విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.