మచిలీపట్నం :
సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖలో విధులు నిర్వహించి ఆరోగ్యంగా పదవీ విరమణ చెందడం అదృష్టమని ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన పోలీస్ సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు సభలో జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు అన్నారు. ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి నాయుడు, అడిషనల్ ఎస్పీ ఏ ఆర్ బి. సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సత్య కిషోర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రాఘవయ్య, రవి కిరణ్, రవికుమార్ ఇతర పోలీసు అధికారులు పదవీ విరమణ చెందుతున్న సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మొదటగా పదవీ విరమణ చెందుతున్న సిబ్బంది ని శాలువాలు జ్ఞాపికలతో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సత్కరించి, పదవి విరమణ కేవలం సర్వీస్‌కు మాత్రమేనని మీ సేవలు ఎల్లవేళలా వినియోగించుకోవడానికి కృష్ణాజిల్లా పోలీస్ శాఖ సంసిద్ధంగా ఉంటుందని ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….30 సంవత్సరాల పైన పోలీస్ శాఖకు ఎనలేని సేవలందించిన మీ అందరికీ అభినందనలు. మీ జీవిత భాగస్వామి సహకారం, కుటుంబ సభ్యులు అందించిన తోడ్పాటు విజయవంతంగా మీ సర్వీసును పూర్తి చేయడానికి అవకాశం కుదిరిందని అన్నారు.
విరమణ అనేది మీ విధులకే గాని మీ ఆరోగ్యానికి కాదని ఇక నుండి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ కనపరుస్తూ కొత్త వ్యాపకాలపై దృష్టిని కేటాయించి శారీరక వ్యాయామం చేస్తూ తరచు మెడికల్ చెకప్ లు చేయించుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని తెలిపారు.
మానసిక ఇబ్బందులు లేకుండా విరమణ సందర్భంగా వచ్చిన ప్రయోజనాలను అర్థవంతంగా వినియోగించుకొని ప్రశాంత జీవనం గడపాలన్నారు. విరమణ చెందినప్పటికీ మీరంతా మా కుటుంబ సభ్యులేనని ఏ సమయంలో ఏ సహాయం కావాలన్నా ధైర్యంగా రావచ్చని తెలిపారు.
ఇప్పటివరకు బంధుమిత్రుల వేడుకలకు, తీర్థయాత్రలకు, దేవాలయ దర్శనాలకు వెళ్లే అవకాశం సరిగా కుదిరి ఉండకపోవచ్చు. కనుక మిగిలిన ఈ జీవితాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ దైవదర్శనాలు చేసుకుంటూ సంతోషంగా ఉండాలని కోరారు.