మచిలీపట్నం :
ఏఆర్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి నిర్వహిస్తున్న వార్షిక మొబిలైజేషన్లో భాగంగా గురువారం మంగినపూడి బీచ్ వద్దగల ఫైరింగ్ రేంజ్ నందు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు.
పోలీసులు తమ విధుల్లో వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పూర్తి స్థాయి పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ తెలిపారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వార్షిక మొబిలైజేషన్ ఫైరింగ్ సాధన ప్రక్రియలో భాగంగా నిర్వహించిన వార్షిక ఫైరింగ్ లో అక్కడ జరుగుతున్న ఫైరింగ్ ప్రక్రియను పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఫైరింగ్ సాధన ప్రక్రియలో ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ పాల్గొని ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న అధికారుల్లో ఉత్సాహం, మనోధైర్యాన్ని నింపారు. ఈ ఫైరింగ్‌లో ప్రతి అధికారి, సిబ్బంది తప్పనిసరిగా పాల్గొని మంచి మెళకువలు నేర్చుకోవాలని, ఫైరింగ్‌కు సంబంధించి ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఫైరింగ్ రేంజ్‌లో క్రమశిక్షణ అత్యంత ప్రాముఖ్యత వహిస్తుందని, ఫైరింగ్ రేంజ్ అధికారుల సూచనల మేరకు అత్యంత జాగ్రత్తగా, ఏకాగ్రతతో ఫైరింగ్ చేయాలన్నారు.
ప్రతి ఒక్క బుల్లెట్ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేదించే నైపుణ్యం పొందాలని సూచించారు. కొత్తగా వచ్చిన ఆయుధాలపై పూర్తి స్థాయి తర్పీదు పొందుతూ, అత్యవసర పరిస్థితుల్లో ప్రజల, ప్రభుత్వ ఆస్తుల, ధన ప్రాణాల రక్షణకై ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు అత్యంత కీలకమని, అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించి జిల్లా పోలీసు శాఖ ఉన్నతి సాధనలో ఎల్లప్పుడూ ముందడుగు వేయాలని సూచించారు.