జిల్లాలో ఎల్‌పిజి నుండి పిఎన్‌జి వైపు మారాలి
మచిలీపట్నం :
జిల్లాలో వినియోగదారులు, వ్యాపార సంస్థలు ఎల్‌పిజి గ్యాస్ వినియోగాన్ని తగ్గించి, పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువు పిఎన్‌జి అదేవిధంగా ఇతర విద్యుత్ ఆధారిత వంట పరికరాల వినియోగం వైపు మళ్లాలని జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ కుమార్ కోరారు.
సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ మీకోసం కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికే నాగాయలంక రిఫైనరీల నుండి సుమారు 450 కిలోమీటర్ల మేర పిఎన్‌జి పైప్‌లైన్ అందుబాటులో ఉన్నందున, ఆ సౌకర్యాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, వైఎస్సార్ తాడిగడప మున్సిపల్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, పరిశ్రమలు తక్షణమే పిఎన్‌జి వినియోగానికి మారాల్సిన అవసరం ఉందన్నారు. పిఎన్‌జి కనెక్షన్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని సంస్థలు 90 రోజులలోపు పిఎన్‌జికి మారకపోతే, వారి ఎల్‌పిజి కనెక్షన్లను డిస్‌కనెక్ట్ చేసే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో పిఎన్‌జికి మారాల్సిన 417 పరిశ్రమలు, 179 ఆసుపత్రులు/నర్సింగ్ హోమ్‌లు, 8 ప్రధాన దేవాలయాలను ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. అలాగే అన్నా క్యాంటీన్లు, ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ప్రాధాన్యత క్రమంలో పిఎన్‌జి వినియోగం చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
గృహ వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు వచ్చే నెల 2వ తేదీన జిల్లాలో ఇండక్షన్ స్టవ్‌లు, బయోగ్యాస్ స్టవ్‌లతో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఇందువల్ల ప్రజలు ప్రత్యామ్నాయ ఇంధన వినియోగంపై అవగాహన పెంపొందించుకుని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్పును స్వీకరించగలరన్నారు.
మెఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ, మున్సిపల్ కమిషనర్లు ఈ మార్పు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. భవిష్యత్తులో గ్యాస్ కొరత వంటి ఇబ్బందులను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో డి ఆర్ ఓ కే చంద్రశేఖర రావు, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.