కృత్తివెన్ను:
కార్పొరేట్ సామాజిక బాధ్యత(సిఎస్ఆర్) కింద ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) అందించే నిధులతో గ్రామాలలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం ఆయన కృత్తివెన్నులోని మండల తహసీల్దారు కార్యాలయంలో పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు కాగిత కృష్ణ ప్రసాద్ కలిసి ఓఎన్‌జీసీ సిఎస్ఆర్ నిధుల వినియోగంపై సంబంధిత అధికారులతో చర్చించారు.
చినపాండ్రాకలోని ఓఎన్‌జీసీ కార్యాచరణ ప్రాంతంలో (ఆపరేషనల్ ఏరియా) ఉన్న కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా చినపాండ్రాక, బంటుమిల్లి, కొమళ్ళపూడి, యండపల్లి, ములపర్రు, మల్లేశ్వరం తదితర గ్రామాలలో రహదారుల అభివృద్ధి, మంచినీటి పైపులైన్ల ఏర్పాటు, ఫిల్టర్ బెడ్ల అభివృద్ధి, స్మశాన వాటికల అభివృద్ధి, ఓవర్ హెడ్ ట్యాంక్ ల నిర్మాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్య పరీక్ష పరికరాలు, కాలువ గట్ల బలోపేతం తదితర పనులకు సంబంధించిన పురోగతిపై చర్చించారు. నిర్ణీత సమయంలో ఆయా పనులు చేపట్టని క్రమంలో నిధులు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉందని, ప్రత్యేక శ్రద్ధ పెట్టి పెండింగ్లో ఉన్న పనులకు ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి ఓఎన్‌జీసీ అధికారులకు సమర్పించాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.
సమావేశంలో బందరు ఇన్చార్జి ఆర్డీవో పోతురాజు, ఓఎన్‌జీసీ హెచ్ ఆర్ చీఫ్ జనరల్ మేనేజర్ రామారావు, ఎసెట్ సపోర్ట్ మేనేజర్ కె వి కె రాజు, జనరల్ మేనేజర్ శివకుమార్, ల్యాండ్ అక్విజేషన్ మేనేజర్ కిషోర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆనంద్, తహసిల్దార్ శశి కుమార్, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.