MachilipatnamLocal News
February 13, 2026
స్పెషల్ స్టోరీ

‘నా ప్రియమైన, గంభీరమైన స్నేహితురాలు అరబెల్ల’

  • February 13, 2026
  • 1 min read
[addtoany]
‘నా ప్రియమైన, గంభీరమైన స్నేహితురాలు అరబెల్ల’

నీ ప్రేమ ఎంతవరకూ అంటే ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే కాదు … తరవాత కూడా… అన్నట్లుగా  మేజర్ ప్యాటర్ తన ప్రియురాలు అరబెల్లా కోసం తపించాడు. 

ప్రియురాలి దేహం  ప్రకృతిలో కలవకుండా తన కళ్ళ ముందు శాశ్వతంగా ఉండాలని ప్రత్యేక ద్రవాలతో భద్రపరిచాడు. 

అలనాటి క్రైస్తవ సమాజం దూరం పెట్టిన ప్రేమ…. రెండు శతాబ్దాలుగా మచిలీపట్నం చరిత్ర పుటల్లో  నిలిచి ప్యాటర్ – అరబెల్లా లను నేటికీ సజీవంగా ఉంచి అమర ప్రేమకు  సాక్ష్యంగా నిలిచిన ‘పరిశుద్ధ మేరీ చర్చి’ చరిత్ర పుటల్లోకి వెళితే …… 

‘నా ప్రియమైన, గంభీరమైన స్నేహితురాలు అరబెల్ల’ 
 
       గతించిన తన ప్రియురాలికి ఓ ప్రేమికుడు అర్పించుకున్న శాశ్వత నివాళి. కృష్ణాజిల్లా ప్రధాన కేంద్రమైన మచిలీపట్నంలో ఒక సమాధి ఫలకంపై రాసి ఉన్న ఈ మాటలు 217 ఏళ్ళ నాటి అరబెల్లా – పాటర్ల ప్రేమకథకి అమరత్వాన్ని ఆపాదించిపెట్టాయి. వారి ప్రేమను మొదటినుండి వ్యతిరేకిస్తూ వచ్చిన మతాధిపతులు, పెద్దలు అరబెల్లా మృతదేహాన్ని స్మశానవాటికలో సమాధిచేయడానికి కూడా ఒప్పుకోలేదు. చలించిన పాటర్ మచిలీపట్నం శివార్లలో ఉన్న పొలాల్లో, గాజు పేటికలో ఆమె శవాన్ని భద్రపరచి సమాధికట్టాడు.
 
          ఆమె శవాన్ని ప్రార్ధన కోసం కూడా చర్చిలోకి అనుమతించకపోయినా, ఆమెను పాతిపెట్టిన స్థలమే ఒక దేవాలయంగా మారింది. అదే నేటి ‘పరిశుద్ధ మేరి చర్చి’. పాటర్ తన ప్రేమ చిహ్నంగా నిర్మించుకున్న అరబెల్లా మందిరాన్ని దైవారాధనకు ఉపయోగించుకుని ఇప్పటికి 217 సంవత్సరాలు పూర్తయ్యాయి. 
        ప్రేమకోసం తపించి, ప్రేమించిన ప్రియురాలు అరబెల్లాని పెళ్ళిచేసుకోవడానికి అనాడు మతాధిపతులు తిరస్కరించినా సహించాడు పాటర్. చివరిదశలో ప్రియురాలి అంతిమ కోర్కెను తీర్చడానికి కూడా మతాధిపతులు అంగీకరించకపోవడంతో ఒంటరి వాడై, తను బతికున్నంతకాలం ఆ ప్రియురాలిని చూసుకోవడం కోసం గాజుపేటికలో చెడి పోకుండా శవానికి రసాయనాలు పూసి దానిని ఒక భవంతిలో భద్రపరచాడు. అలా పవిత్రంగా భద్రపరచి ప్రతిష్టించిన అరబెల్లా స్మారక చిహ్నమే నేడు మచిలీపట్నంలో ‘పరిశుద్ధ మేరీ చర్చి‘గా ప్రాచుర్యం పొందింది. 
         ఆంధ్రప్రదేశ్లోని చర్చిలలో అతి పురాతనమైన పరిశుద్ధ మేరీ చర్చి నేడు మచిలీపట్నంలో ఎంతో మంది క్రైస్తవ భక్తులను ఆకర్షిస్తోంది. కడప, కర్నూలు, విజయవాడ, గుంటూరు తదితర చోట్ల నిర్మించిన చర్చిలు అటు పిమ్మట నిర్మించినవేనని చెబుతారు. గత రెండు శతాబ్దాలలో అనేక ఇబ్బందులను, వాతావరణ బీభత్సాలను తట్టుకుని నిలబడిన చర్చి రాష్ట్రంలో ఇదొక్కటేనంటే అతిశయోక్తికాదు. 
 
            ఈ చర్చి నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం 3790రూపాయలు కేటాయించగా ఆ డబ్బుతో చర్చి చుట్టూ ప్రాకారం నిర్మించారు. ఈప్రాకారం లోపల నోబుల్ కళాశాల షార్కీస్కూల్ వ్యవస్థాపకుడైన నోబుల్ షార్కీ మొదలగు విదేశీయుల సమాధులు ఉండి మచిలీపట్నం చారిత్రాత్మక ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. ఈ కట్టడం నిర్మాణం వెనుక చారిత్రాత్మకమైన కథ ఉంది. ప్రేమకు చిహ్నంగా వెలసి ఇప్పటికీ క్రిస్టియన్ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచింది. 
 
        1600 సంవత్సరాల పూర్వం మచిలీపట్నం విదేశీ వర్తకులను ఎంతో ఆకర్షించింది. పోర్చుగ్రీసు, ఫ్రెంచ్, ‘ఆంగ్లేయుల వర్తకులు ఈపట్టణాన్ని గుర్తించి సముద్రమార్గాన్ని వ్యాపార కేంద్రంగా చేసుకుని ఆ తర్వాత తమ సైనిక స్థావరాలను ఏర్పరుచుకున్నారు. క్రీస్తు బోధనలు ప్రబోధించి తమ మత సంబంధమైన ఆచారాలను భారతదేశమంతటా ప్రచారం చేసిన మొదటి ఆంగ్లేయుడు ఫాదర్ రెవరెండ్ ప్యాట్రిక్ కోప్లాండ్. ఆయన మొదటి సారి 1614లో మచిలీపట్నంలో కాలు పెట్టారు. అతర్వాత క్రమంగా 1650 వ సంవత్సరం నుండి విదేశీ మతాధికారులు అనేక మంది మచిలీపట్నం వచ్చారు. 1616లో ఇంగ్లాండ్ వెళ్ళిన తొలి భారతీయుడు మచిలీపట్నం వారే కావడం విశేషం. అతను అప్పటి బ్రిటన్ రాజు కోరిక మేరకు లండన్లోని చర్చిలో బిషప్ క్యాంటరీ బరి చర్చి ద్వారా బాప్టిజం పొందారు. 1676లో బందరు కోట వద్ద క్రైస్తవ దేవాలయాన్ని నిర్మించాడు. ఆతర్వాత 1678లో మరో పరిశుద్ధ కేథరిన్ దేవాలయాన్ని నిర్మించాడు. 
 
            క్రైస్తవ మతం మచిలీపట్నంలో నిలదొక్కు కుంటున్న సమయంలో ఎందరో సంపన్నులైన ఆంగ్లేయులు మచిలీపట్నం వలస వచ్చారు. అలా వలస వచ్చిన వారిలో ఒకరు కెప్టెక్ కాబిన్ సన్స్ అతని కుమార్తె అరబెల్లా ఉన్నారు. యవ్వన దశలో ఉన్న అరబెల్లా గొప్ప సౌందర్యరాశి. ప్రపంచంలో ఉన్న అందాన్నంతా ఒక్క చోట చేర్చినట్లు గులాబీల సౌందర్యం, మల్లెల మెత్తదనం, సన్నజాజి పరి మళం అద్దినట్లు అరబెల్లా అత్యంత అందంగా ఉండేది. అదే సమయంలో బందరు కోట వద్ద సైన్యాలకు అధిపతిగా మేజర్ జనరల్ పాటర్ ను నియమించారు. కెప్టెన్ గా వచ్చిన రాబిన్సన్ హోదాకంటే పాటర్ హోదా ఎంతో పెద్దది. ఒక కార్యక్రమంలో మేజర్ జనరల్ పాటర్ అరబెల్లాను కలుసుకున్నారు. అరబెల్లా అందానికి ముగ్ధుడైన పాటర్ ఆమె నుండి తప్పించుకోలేకపోయాడు. 
 
           తనకంటే 18 సంవత్సరాలు చిన్నదైన అరబెల్లాను తొలి చూపులోనే ప్రేమించాడు. పాటర్ హోదా మాటతీరుకు ఆకర్షితురాలైన అరబెల్లా కూడా తొలిచూపులోనే అతని ప్రేమలో పడిపోయింది. వారి ప్రేమను చూసి సహించని రాబిన్సన్, మతాధిపతులు… పాటర్, అరబెల్లాకు అడ్డుగా నిలిచారు. వారు కలుసుకోవడానికి పెళ్ళి చేసుకోవడానికి అనేక ఆటంకాలు కల్పించారు. 
 
           అయినా పాటర్, అరబెల్లా ఆనాటి నిబంధనలను కాదని వివాహానికి న్యాయ పరమైన కొన్ని చిక్కులు ఏర్పడ్డా లెక్కచేయక భార్యాభర్తల్లా మెలగసాగారు. సాంప్రదాయబద్దం కాని ఆ చర్యను ఆనాడు ఎందరో విమర్శించారు. అరబెల్లా కోరిక ఒక్కటే. తమ వివాహానికి అడ్డుగా నిలిచిన న్యాయమైన చిక్కును ఎలాగైనా అదిగమించి ధవళ వస్త్రాలతో, వివాహ సంబంధమైన ఆభరణాలతో చర్చిలో పాటర్ భార్యగా నిలబడి ప్రేమకు నిర్వచనంలా ఉండాలనేది ఆమె కోరిక. 
 
             అదే సమయంలో 1809లో ఆంగ్లేయులు – సిపాయిల అంతఃకలహం జరిగినపుడు మద్రాసులోని సైన్యాధికారులు దెబ్బతిన్నారు. ఈ వైఫల్యం కారణంగా అగ్రహావేశుడైన బ్రిటీష్ రాజు దక్షిణ భారతదేశంలో ఉన్న ఆంగ్లేయ సైన్యాధికారులపై కొన్ని ఆంక్షలు విధించి వారికి చెందవలసిన అనేక ప్రమోషన్లు రద్దు చేశారు. ఆంగ్లేయ సిపాయిల్లో కూడా అంతః కలహాలు చెలరేగి పాటర్ పై కొంత మంది ఎదురు తిరిగారు. అలా ఎదురు తిరిగిన వారిలొ అరబెల్లా తండ్రి రాబిన్సన్ కూడా ఉన్నాడు. 
 
            తన ప్రియుడైన పాటర్ కు వ్యతిరేకంగా తన తండ్రి ప్రవర్తించడం పట్ల అరబెల్లా ఎంతో కలత చెందింది. దుఃఖించింది. ఇటు కన్న తండ్రి, అటు ఎంతో ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు, ఏమి చేయాలో, ఎలా చేయాలో, ఎలా ఈ సమస్యను పరిష్కరించాలో తెలియక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఎంతో సంతోషంగా గడపవలసిన రాత్రులు వృధాగా కరిగి పోయాయి. చల్లని వెన్నెల రాత్రులు విషాదంగానే గడచి పోయాయి.
 
              ప్రియుని ఎడబాటును సహించలేని అరబెల్లా ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. ఈలోగా జరిగిన కొన్ని సంఘటనల వల్ల మచిలీపట్నంలో తిరుగు బాటు చేసిన సిపాయిలు తమ తప్పిదాన్ని ఒప్పుకుని జనరల్ పాటర్ కు లొంగిపోయారు. దాంతో 1809 ఆగష్టు నెలలో జనరల్ పాటర్ ప్రతిష్ట ఎంతో పెరిగింది. ఆగష్టు నెలలో విజయోత్సవాన్ని అందుకున్న పాటర్ కు మూడు నెలలు తిరగకముందే ప్రపంచమంతా దుఃఖమయంగా కన్పించింది.
 
              తాను ఎంతో అపురూపంగా ప్రేమించిన అరబెల్లా 1809 నవంబరు 6వ తేదీన 40సంవత్సరాల వయసులో అవివాహితగానే పాటర్ చేతిలో కన్నుమూసింది. పాటర్ అరబెల్లా కోరికపై శవానికి ధవళ వస్త్రాలు ధరింపచేసి ఆభరణాలు అలంకరించి మరణశయ్యను సిద్ధం చేసి ఆమె అంతిమ వీడ్కోలుకు సన్నాహాలు చేశారు. అరబెల్లా పాప స్థితిలో మరణించిందన్న నెపంతో ఆనాటి పరిశుద్ధ యోహెూను ఆవరణలో గాని, బందరు కోటలో ఉన్న స్మశానంలో గాని అరబెల్లాను సమాధి చేయడానికి క్రైస్తవ సంఘాధికారులు ఒప్పుకోలేదు. 
 
          కనిపించిన ప్రతి క్రైస్తవాధికారిని తన ప్రేయసి అరబెల్లాను సమాధి చేయడానికి స్మశానంలో ఇంత స్థలం ఇవ్వమని కన్నీటితో వేడుకున్నాడు పాటర్. ఎవరూ అతని కన్నీటిని చూసి కరిగిపోలేదు. గత్యంతరం లేక పాటర్, అరబెల్లా శవం కుళ్ళిపోకుండా ఉండటం కోసం రసాయనాలు పూసి వధువు వస్త్రాలతో దీర్ఘ నిద్రలో ఉన్న అరబెల్లాను అనాటి బందరు శివారు (ఆనందపేట) పొలాల్లో ఫాదర్ ప్రార్దన లేకుండానే గాజుపలకలో 
పెట్టి పాతిపెట్టారు. 
 
            అరబెల్లా శవాన్ని ప్రార్ధన కొరకైనా చర్చిలోకి అనుమతించకపోయినా, ఆమెను పాతిపెట్టిన స్థలమే ఒక దేవాలయంగా మారి ఆమెకు తుది నివాళులర్పించింది. అదే పరిశుద్ధ మేరీ చర్చిగా మారింది. అరబెల్లాతో గడిపిన మధుర క్షణాలను మరచిపోలేక ఆమెను పాతిపెట్టిన చోట ఎప్పుడు కావాలంటే అప్పుడు అరబెల్లా శవాన్ని చూసుకోవడానికి వీలుగా నేలలో ఒక అరను ఏర్పాటు చేసి అందులో అరబెల్లా శవ పేటికను ఏర్పాటు చేశాడు. సమాధి గోడకు ఒక కొయ్య పావురాన్ని ఏర్పాటు చేశాడు.
 
             ఆ కొయ్య పావురాన్ని తిప్పితే చాలు శాశ్వత నిద్రలో ఉన్న అరబెల్లా గాజు పేటికతో సహా పైకి వచ్చే విధంగా ఏర్పాటు. ప్రతిరోజు పాటర్ అక్కడకు వచ్చి తన ప్రియాతి ప్రియమైన అరబెల్లాను చూసుకుని దైవ ప్రార్ధనలు చేసుకుని తీరని దుఃఖంతో కుమిలిపోయేవాడు. సమాధి గోడపై అమర్చిన శిలా ఫలకంపై జనరల్ పాటర్ అరబెల్లాను ‘తన ప్రియమైన గంభీరమైన స్నేహితురాలు’ గా వర్ణించు కున్నాడు. ఇప్పటికీ ఆ ఫలకం చెక్కు చెదరకుండా చూపరులను ఆకర్షిస్తుంది.
           1815లో జనరల్ పాటర్ ఎంతో శ్రమించి 18వేల ఖర్చుతో అరబెల్లాను పాతిపెట్టిన చోట ఒక దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి దానికి ‘పరిశుద్ధ మేరి చర్చి’ అని నామకరణం చేశాడు. అది అరబెల్లా – పాటర్ ల ప్రేమకు చిహ్నంగా నిలిచింది. అప్పటి నుండి అనేక మంది క్రైస్తవులు దానిని ప్రార్ధనా మందిరంగా, దైవమందిరంగా కొలుచుకుంటున్నారు. 1816లో పాటర్ తను నిర్మించిన స్మారక దేవాలయాన్ని ఈస్ట్ ఇండియా మతాధికారు లకు బహూకరించాడు. 1819లో ఈ పరిశుద్ద మేరి చర్చికి సంపూర్ణ అధికారాలు బ్రిటిష్ మతాధికారులు అనుగ్రహించారు. 1842లో మద్రాసు బిషప్ మచిలీపట్నంను సందర్శించి జనవరి 10వ తేదిన అరబెల్లా చర్చిని ప్రతిష్టించారు. 
           ఒకనాడు అరబెల్లా శవానికి ఆలయప్రవేశాన్ని నిరాకరించిన ఫాదర్ పశ్చాత్తాపుడై అరబెల్లా చర్చి ముందు కూడా ప్రార్ధనలు చేయడానికి అంగీకరించాడు. దీని తర్వాత బ్రిటీష్ అధికారులు పాటర్ ను మద్రాసుకు బదిలీ చేశారు. అరబెల్లా ఎడబాటును తట్టుకోలేని పాటర్ ఆమె జ్ఞాపకాలలోనే మానసికంగా కృంగిపోయి, అరబెల్లా తలపులతోనే నిరంతరం గడుపుతూ 1819లో తనువు చాలించాడు. ఇప్పటికీ మద్రాసులో పాటర్ ఉద్యానవనం, పాటర్ రోడ్డు ఆయన జ్ఞాపక చిహ్నంగా నిలచి ఉన్నాయి. 
 
            పాటర్ మచిలీపట్నం నుండి వెళ్ళిన తర్వాత అరబెల్లా చర్చి నుంచి పరిశుద్ధ మేరీ చర్చిగా మారిన తర్వాత ఒక సారి ఆ చర్చిలో పనిచేస్తున్న మనిషి బూజు దులపడం కోసం కొయ్య పావురాన్ని తాకడంతో అరబెల్లా శవం అమర్చబడిన గాజుపేటిక పైకి రావడంతో….. ఇది తెలియని పనివాడు ఆ శవాన్ని చూసి అక్కడికక్కడే గుండె అగి చనిపోయాడు. దాని ఫలితంగానే అప్పటి బ్రిటీష్ కలెక్టర్ ఆ చర్చి వృత్తాంతమంతా తెలుసుకుని, ఆ అరను శాశ్వతంగా చలువరాళ్లతో మూయించేసి, మళ్లీ ఎప్పుడూ దాన్ని తెరవకూడదని ఆజ్ఞలు జారీ చేశాడు. ఇప్పటికి అరబెల్లా శవం ఉన్న అర, దాని తాలుకు చిహ్నాలు ‘పరిశుద్ధ మేరి చర్చి’లో చూడవచ్చు. 
           అరబెల్లా చనిపోయి 217 సంవత్సరాలు గడిచినా…..  అరబెల్లా – పాటర్ల ప్రేమకు చిహ్నంగా పరిశుద్ధ మేరీ చర్చి నిలిచి క్రిస్టియన్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పటికీ, ఎప్పటికీ ఈ ప్రేమమందిరం చరిత్రకు సాక్షీభూతంగా నిలిచే ఉంటుంది. 
 
నందం రామారావు,
మచిలీపట్నం 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *