MachilipatnamLocal News
March 30, 2026
స్పెషల్ స్టోరీ

మరణం భయపడేలా జీవించారు.. దేశం గర్వపడేలా ప్రాణాలిచ్చారు!

  • March 22, 2026
  • 1 min read
[addtoany]
మరణం భయపడేలా జీవించారు.. దేశం గర్వపడేలా ప్రాణాలిచ్చారు!
” మార్చి 23 – అమరవీరుల దినోత్సవం సందర్భంగా భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు ఘన నివాళులు.”
 
        కేవలం 23 ఏళ్ల ప్రాయం.. ఆ వయసులో సామాన్య యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కానీ, భగత్ సింగ్ మాత్రం దేశ విముక్తి కోసం రక్తాన్ని ధారబోశారు. జైలు గోడల మధ్య ఉన్నా, ఉరికొయ్య ముందే ఉన్నా.. ఆయన గొంతులో ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అన్న నినాదం తగ్గలేదు. బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించిన ఆ ధైర్యం నేటికీ మనందరికీ స్ఫూర్తిదాయకం.”
 
       1931 మార్చి 23న బ్రిటిష్ ప్రభుత్వం విప్లవ వీరులైన భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను ఉరి తీసింది. వీరి త్యాగాన్ని స్మరిస్తూ ఈ రోజును అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు.
 

       భగత్ సింగ్ భారత స్వతంత్ర సంగ్రామంలో అత్యంత ప్రభావవంతమైన విప్లవకారుడు. కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించి, కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు. 

      భగత్ సింగ్ సెప్టెంబర్ 28, 1907న పంజాబ్‌లోని బంగా(ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి కిషన్ సింగ్, బాబాయ్ అజిత్ సింగ్ ఇద్దరూ స్వాతంత్ర్య సమరయోధులు కావడంతో చిన్నప్పటి నుండే భగత్ సింగ్‌లో దేశభక్తి మెండుగా ఉండేది.
 
        1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోత భగత్ సింగ్‌ను తీవ్రంగా కలచివేసింది. 12 ఏళ్ల వయసులోనే జలియన్ వాలాబాగ్ రక్తంతో తడిసిన మట్టిని ఒక సీసాలో నింపుకుని, బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమికొట్టాలని శపథం చేశారు.
 
హెచ్ఎస్ఆర్ఏ  స్థాపన
      చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్ఎస్ఆర్ఏ) లో కీలక పాత్ర పోషించారు. సాయుధ పోరాటం ద్వారానే సంపూర్ణ స్వరాజ్యం సాధ్యమని ఆయన నమ్మారు.
 
“లాలా లజపతిరాయ్ మరణానికి ప్రతీకారంగా చేసిన సాహసోపేతమైన దాడి” 
 
        బ్రిటిష్ పోలీస్ అధికారి జాన్ శాండర్స్‌ను భగత్ సింగ్ మరియు రాజ్‌గురు 1928, డిసెంబర్ 17న లాహోర్‌లో కాల్చి చంపారు. ఈ ఘటన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం  సైమన్ కమిషన్‌కు వ్యతిరేక నిరసనలో పాల్గొన్న ప్రముఖ నాయకుడు లాలా లజపతిరాయ్ పై బ్రిటిష్ పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఆ గాయాల కారణంగానే ఆయన మరణించారు. ఈ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ నిర్ణయించుకున్నారు.
 
      నిజానికి వారు లాఠీ ఛార్జ్‌కు ఆదేశించిన పోలీస్ సూపరింటెండెంట్ జేమ్స్ స్కాట్‌ను చంపాలని ప్లాన్ చేశారు. కానీ, గుర్తు పట్టడంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ అయిన జాన్ శాండర్స్‌ను కాల్చి చంపారు.
 
       ఈ ఘటన తర్వాత భగత్ సింగ్ లాహోర్ నుండి తప్పించుకున్నారు. అయితే, తరువాతి కాలంలో సెంట్రల్ అసెంబ్లీలో బాంబు విసిరిన కేసులో పట్టుబడినప్పుడు, ఈ శాండర్స్ హత్య కేసు (లాహోర్ కుట్ర కేసు) కూడా ఆయనపై మోపబడింది.
   
        1929లో ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ బాంబులు విసిరారు. అయితే, ఎవరినీ చంపడం వారి ఉద్దేశ్యం కాదు, “చెవిటి వారికి వినిపించడానికే” ఆ దాడి చేశారు. అక్కడే వారు ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ (విప్లవం వర్ధిల్లాలి) అనే నినాదాన్ని మొదటిసారిగా ఇచ్చారు.
 
        జైలులో ఉన్నప్పుడు భారతీయ రాజకీయ ఖైదీల హక్కుల కోసం భగత్ సింగ్ 116 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఆయన వ్రాసిన “నేను నాస్తికుడిని ఎందుకు?” (Why I am an Atheist) అనే పుస్తకం నేటికీ ఎంతో ప్రసిద్ధి.
 
         1931 మార్చి 23న లాహోర్ జైలులో భగత్ సింగ్, రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లను ఉరితీశారు. ఉరికొయ్య వద్దకు కూడా చిరునవ్వుతో, దేశభక్తి గీతాలు పాడుకుంటూ వెళ్లడం ఆయన ధైర్యానికి నిదర్శనం.
        
“విప్లవ శిఖరం – భగత్ సింగ్” 
 
       భగత్ సింగ్ కేవలం ఒక పోరాట యోధుడే కాదు, గొప్ప మేధావి కూడా. ఆయన సమాజంలో సమానత్వం కోసం పరితపించేవారు. భారత స్వతంత్ర సంగ్రామంలో చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడిన విప్లవ వీరుడు భగత్ సింగ్  ప్రముఖ సూక్తులు
 
  “వ్యక్తులను చంపవచ్చు కానీ, వారి ఆశయాలను చంపలేరు. గొప్ప సామ్రాజ్యాలు కూలిపోవచ్చు కానీ, గొప్ప ఆలోచనలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి.”
 
  “విప్లవం అంటే కేవలం బాంబులు, పిస్టల్స్ కాదు.. విప్లవం అంటే అన్యాయమైన సమాజ వ్యవస్థలో మార్పు తీసుకురావడం.”
 
 “నేను ఒక మనిషిని.. మానవాళిని ప్రభావితం చేసే ప్రతిదీ నన్ను ఆందోళనకు గురి చేస్తుంది.
 
 “బాంబులు, తుపాకులు విప్లవాన్ని తీసుకురావు.. విప్లవం అనే కత్తికి పదును పెట్టేది కేవలం ఆలోచనలు మాత్రమే”.
 
శ్యామ్ కాగిత,
మచిలీపట్నం 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *