[addtoany]
విజయవాడ:
నగరంలోని మాకినేని బసవ పున్నయ్య ఫంక్షన్ హాల్‌లో శనివారం నిర్వహించిన ఉమ్మడి కృష్ణా జిల్లా సొసైటీ చైర్మన్‌ల మహాజనసభలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం రఘురాం పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేడీసీసీ బ్యాంక్ అభివృద్ధిలో సొసైటీ చైర్మన్‌లు, సభ్య సంఘాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన సహకార బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లాల వారీగా బ్యాంక్ ప్రస్తుత స్థితిని వివరించిన ఆయన కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం పనితీరు పరంగా కేడీసీసీ బ్యాంక్ 5వ స్థానంలో నిలిచిందని తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ వంటి ప్రధాన వాణిజ్య బ్యాంకులతో పోటీ పడుతూ ఈ స్థానం సాధించడం గర్వకారణమని అన్నారు. గతంలో 3వ స్థానంలో ఉన్నప్పటికీ, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల విలీనాల తరువాత పోటీ పెరగడంతో ర్యాంకింగ్‌లో మార్పు వచ్చినట్లు పేర్కొన్నారు.
అయితే, సహకార బ్యాంకింగ్ రంగంలో కేడీసీసీ బ్యాంక్ రాష్ట్రవ్యాప్తంగా 1వ స్థానంలో, దేశవ్యాప్తంగా 4వ స్థానంలో నిలిచిన విషయాన్ని ఆయన గర్వంగా వెల్లడించారు. ఇది బ్యాంక్ సిబ్బంది, మేనేజ్‌మెంట్, సభ్య సంఘాల సమిష్టి కృషికి నిదర్శనమని అన్నారు. రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన కేడీసీసీ బ్యాంక్, జనతా ఇన్సూరెన్స్ పథకం ద్వారా రైతులకు భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుందని చెప్పారు. అదేవిధంగా, ఆ రైతు తీసుకున్న పంట రుణంపై ఉన్న వడ్డీ మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేసి, కుటుంబానికి ఆర్థిక ఉపశమనం కల్పిస్తున్నామని వెల్లడించారు.
పిఎసియస్ సభ్యులకు అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.10,000 సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం విద్యా రుణాలు, గృహ రుణాలు, వ్యవసాయ భూమి కొనుగోలు రుణాలు వంటి పలు రుణ సదుపాయాలను అందిస్తున్నామని చెప్పారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను విస్తరించే దిశగా ఆర్ టి జి ఎస్, ఎన్ ఈ ఎఫ్ టి, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు క్యూ ఆర్ కోడ్ సౌకర్యాలను కూడా అందిస్తున్నామని వివరించారు.
మహాజనసభలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు:
రైతులకు ఉపశమనంగా ₹182.31 లక్షల వడ్డీ మాఫీకి ఆమోదం
2026–27 ఆర్థిక సంవత్సరానికి ₹115.68 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
బంటుమిల్లి PACS, సేరి లక్ష్మీపురం PACS నుండి స్థలాల కొనుగోలు చేసి బ్రాంచ్ భవనాల నిర్మాణానికి ఆమోదం
వెల్లటూరు, రెడిగూడెం (ఎన్టీఆర్ జిల్లా), సేరి లక్ష్మీపురం (కృష్ణా జిల్లా) ప్రాంతాల్లో 3 కొత్త బ్రాంచ్‌ల ప్రారంభానికి ఆమోదం
ఈ సందర్భంగా ఉద్యోగులందరూ తమ బాధ్యతలను జవాబుదారీతనంతో నిర్వర్తించాలని, రైతులకు నాణ్యమైన సేవలందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడరాదని సూచించారు. సొసైటీ అధ్యక్షులు పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా చైర్మన్ నెట్టెం రఘురాం విజ్ఞప్తి చేశారు. సభ్యుల సహకారం, సమర్థవంతమైన వ్యూహాలు, సేవా భావంతో కేడీసీసీ బ్యాంక్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకుంటుందని చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఇటీవల మరణించిన నవాబుపేట సొసైటీ చైర్మన్ చింతా వెంకటేశ్వరరావు కి సభ సంతాపాన్ని తెలియజేసింది.
2026–27 సంవత్సరానికి మేనేజర్ స్థాయి నుంచి ఏజీఎం స్థాయి వరకు ఉద్యోగుల వేతన సవరణలో తన అమూల్యమైన సహకారం అందించిన చైర్మన్ కు ఉద్యోగ సంఘ నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అక్కినేని రాజా, సంబదువ రావు, వాసవి కుమారి, పెర్నీ సురేష్, సోమయ్య, ఎన్. శ్రీనివాసరావు తదితర నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం పట్ల ఆయన చూపిన చిత్తశుద్ధి, పట్టుదల ప్రశంసనీయం అని కొనియాడారు. ఉద్యోగుల ఆర్థిక స్థితిని మెరుగుపర్చే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో సేవలు అందించడానికి దోహద పడుతుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామ్ మనోహర్, డిసిఓ చంద్రశేఖర్ రెడ్డి, జిఎంలు రంగబాబు, చంద్రశేఖర్, ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన సొసైటీ ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు.

