MachilipatnamLocal News
March 30, 2026
జిల్లా

కార్యాలయాలను ‘జీరో వేస్ట్’ ఇన్స్టిట్యూషన్స్‌గా మార్చాలని కలెక్టర్ పిలుపు

  • March 28, 2026
  • 1 min read
[addtoany]
కార్యాలయాలను ‘జీరో వేస్ట్’ ఇన్స్టిట్యూషన్స్‌గా మార్చాలని కలెక్టర్ పిలుపు
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ రహిత విప్లవం..
 
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగానికి స్వస్తి
 
మహిళా పారిశ్రామికవేత్తను ప్రోత్సహిస్తూ ‘అమృత కృష్ణ’ బ్రాండ్ గాజు సీసాల పరిచయం
 
మచిలీపట్నం: 
 
జిల్లాలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వ కార్యాలయాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించి చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు.
 
స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమములో భాగంగా వ్యర్థ రహిత సంస్థలు (జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్) ఇతివృత్తంతో జిల్లా యంత్రాంగం శనివారం ఉదయం కలెక్టరేట్ సమీపంలోని రహదారులు భవనాల శాఖ (ఆర్ అండ్ బి) కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయ ప్రాంగణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్ తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. కలెక్టర్ ఆర్ అండ్ బి కార్యాలయానికి ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి మొదలుకొని చిలకలపూడి పోలీస్ స్టేషన్ జంక్షన్ మీదుగా పరాసుపేట సెంటర్ వరకు రహదారి వెంబడి ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. మార్గమధ్యలో గృహ, షాపుల యజమానులతో ముఖాముఖి మాట్లాడి తడి పొడి చెత్తగా వేరుచేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. తిరిగి ఆయన ఆర్ అండ్ బి కార్యాలయ ప్రాంగణానికి చేరుకుని ఉద్యోగుల చేత స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు. కేవలం ప్లాస్టిక్‌ను నిషేధించడమే కాకుండా, దానికి ప్రత్యామ్నాయంగా ఒక శాశ్వత పరిష్కారాన్ని కార్యరూపంలోకి తెచ్చామని తెలిపారు. ప్రభుత్వ పథకమైన పీఎంఈజీపి ద్వారా ఒక పేద ఎస్సీ మహిళా పారిశ్రామికవేత్తకు రుణం ఇప్పించి, ఆమె ద్వారా ‘అమృత కృష్ణ’ అనే బ్రాండ్‌తో గాజు వాటర్ బాటిల్స్ సరఫరాను కలెక్టరేట్లో ప్రారంభించామని, ఈ బాటిళ్లను వాడి తిరిగి ఇచ్చేసే విధానం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, “మొదట్లో నా వాహనంలో కూడా ప్లాస్టిక్ బాటిళ్లే ఉండేవి. కానీ పర్యావరణంపై వాటి ప్రభావం గమనించిన తర్వాత, నేను స్టీల్ బాటిల్స్ వాడటం ప్రారంభించాను. మన నుంచి మార్పు మొదలైనప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది” అని తెలిపారు.
 
ఒక చిన్న కార్యాలయం నుంచి నెలకు సుమారు 1,250 ప్లాస్టిక్ బాటిళ్లు వ్యర్థాలుగా మారుతున్నాయని, జిల్లాలోని అన్ని ప్రధాన కార్యాలయాలను కలిపితే నెలకు సుమారు 37,500 బాటిళ్లు పర్యావరణంలోకి చేరుతున్నాయని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వినాశనాన్ని ఆపడమే ‘జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్’ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.
 
ప్రతి అధికారి, సిబ్బంది తమ వెంట వ్యక్తిగత వాటర్ బాటిల్ లేదా ఫ్లాస్క్ ఉంచుకోవాలని సూచిస్తూ,
టీ, కాఫీ తాగేందుకు పేపర్ లేదా ప్లాస్టిక్ కప్పులకు బదులుగా సొంత కప్పులను వాడాలని చెప్పారు.
సమావేశాల్లో ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా ‘అమృత కృష్ణ’ వంటి పునర్వినియోగ గాజు సీసాలు మాత్రమే వాడాలి అని చెబుతూ పర్యావరణాన్ని కాపాడుకునే ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
కార్యక్రమంలో డిఆర్ఓ కే చంద్రశేఖరరావు, జెడ్పి సీఈవో కే కన్నమనాయుడు, డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరరావు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి రమేష్, పశుసంవర్ధక శాఖ అధికారి చిన్న నరసింహులు, గృహ నిర్మాణ సంస్థ పిడి వెంకట్రావు, నగర కమిషనర్ బాపిరాజు,ప్రకృతి వ్యవసాయ డిపిఎం పార్థసారథి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఝాన్సీ లక్ష్మి, కలెక్టరేట్ ఏవో రాధిక, జిల్లా సహకార అధికారి కే చంద్రశేఖర్ రెడ్డి తదితర జిల్లా అధికారులు, ఆయా శాఖల ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *