మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 11వ తేదీన ఢిల్లీలో సదస్సు
ఆంధ్రప్రదేశ్ నుంచీ ఎంపికైన 13 మంది ప్రజాప్రతినిధుల్లో కృష్ణకుమారి ఒకరు
చల్లపల్లి, 8 మార్చి 2026, SSN :
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న మహిళా జాతీయ సదస్సులో కృష్ణాజిల్లా తరపున చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచీ 13 మంది ప్రజాప్రతినిధులను, ఆరుగురు మహిళా అధికారులను సదస్సులో పాల్గొనేందుకు ఎంపికచేయగా, వారిలో కృష్ణకుమారి ఒకరు.
మార్చి నెల 11వతేదీన ఢిల్లీలోని డా. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో మహిళా ప్రజాప్రతినిధుల జాతీయ సదస్సు జరుగనుంది. ఈమేరకు కృష్ణాజిల్లా నుంచీ కృష్ణకుమారిని ఎంపికచేస్తూ పంచాయతీరాజ్ కమీషనర్ ఎం.కృష్ణతేజ ఉత్తర్వులు వెలువరించారు. మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో పరిపాలనలో మహిళా ప్రజాప్రతినిధులు అనుభవాలను, పాలనా సామర్థ్యం, నాయకత్వం గురించి జాతీయ సదస్సులో చర్చించటం, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, కేంద్రమంత్రుల ప్రసంగాలతో పాటు మినిట్ టు మినిట్ కార్యక్రమాలు జాతీయ సదస్సులో జరుగనున్నాయి.
చల్లపల్లి సర్పంచ్ గా ఉన్న పైడిపాముల కృష్ణకుమారి, గతంలో చల్లపల్లి జడ్పీటీసీగా పనిచేసి సుదీర్ఘకాలం మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్నారు. 2024లో ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన పంద్రాగస్టు వేడుకలకు కేంద్ర ప్రభుత్వం నుంచీ ప్రత్యేక ఆహ్వానం అందటంతో పాల్గొన్నారు. జాతీయ సదస్సులో పాల్గొని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ చేతులమీదుగా సన్మానం పొందారు.