వైసీపీలో రంగ వర్ధంతి వివాదం
SSN
- December 26, 2025
- 0 min read
[addtoany]
శాంతియుతంగా వంగవీటి మోహన రంగాకు ఘనంగా నివాళులు.
మచిలీపట్నం:
మచిలీపట్నం ఎప్పుడూ గొడవలకు ఆమడ దూరంలో ఉంటుంది. అందులో రాజకీయ గొడవలు మడ అడవులతో నిండి ఉన్న బందరు నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో కూడా అరుదు!
అలాంటి నగరంలో గొడవలవుతాయని పోలీస్ భోగట్టా! ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష వైసీపీని వెనకకు తగ్గమని ఖాకీ పహారా!
తగ్గిన వాడెప్పుడూ తక్కువ వాడు కాదు అని హుందాగా వ్యవహరించి ర్యాలీ సమయాన్ని మార్చి… తగ్గిన వైసీపీ
వంగవీటి మోహనరంగా వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం మచిలీపట్నం నగరంలో కూటమి నాయకులు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు వేరువేరుగా ర్యాలీగా వెళ్లి రంగా విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించాలని అనుకున్నారు.
ఇరు పార్టీ లకు చెందిన నాయకులు,కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి వెళ్లే సమయం ఒకటి కావడంతో శాంతి భద్రతలకు భంగం కలుగుతాయేమోనని అనుమానంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
కూటమి నాయకులు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ర్యాలీగా వెళ్ళే సమయం ఒకటే కావటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పేర్ని వెంకట్రామయ్య (నాని) ను సంప్రదించి మాట్లాడారు.
అనంతరం పోలీసులు, వైసిపి నాయకులకు కొన్ని సూచనలు చేశారు. ర్యాలీ సమయాన్ని మార్పు చేయవలసిందిగా వైయస్సార్సీపి పార్టీ నాయకులు పేర్ని నానిని, పోలీసులు కోరారు. దీనిపై వైసిపి నాయకులు నాని పోలీసులతో విభేదించారు.
ముందస్తు చర్యలో భాగంగా కృష్ణాజిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు పేర్ని నాని ఇంటి వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ర్యాలీ సమయాన్ని మార్చేది లేదని తేల్చి చెప్పడంతో కాస్తంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మచిలీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏసుబాబు వైఎస్ఆర్సిపి పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య నానితో చర్చించి, నచ్చ చెప్పడంతో సమయాన్ని మార్పు చేయడానికి అంగీకరించారు. దీనితో ఉద్రిక్తత వాతావరణం సద్దుమణిగింది.
కూటమి నాయకులు ర్యాలీ అనంతరం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ర్యాలీగా బయలుదేరి వెళ్లి వంగవీటి మోహన రంగ కు ఘనంగా నివాళులర్పించారు. కూటమి, వైఎస్ఆర్సిపి పార్టీ ల మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో వంగవీటి మోహనరంగా కు నివాళులర్పించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

