పేదల జీవితాల్లో వెలుగులు నింపినపుడే.. వంగవీటి రంగాకు అసలైన నివాళి అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆజన్మాంతం పేదల కోసమే పోరాడి అశువులు బాసి 37 సంవత్సరాలు పూర్తైనప్పటికీ నేటికీ.. ప్రజల గుండెల్లో ఛిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఈ మేరకు మచిలీపట్నంలోని కోనేరు సెంటర్ నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి రేవతి సెంటర్లో ఏర్పాటు చేసిన వంగవీటి రంగ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. వంగవీటి రాధ రంగ మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కూటికోసం, గూడు కోసం అవస్థలు పడుతున్న పేదల పక్షాన వంగవీటి రంగా చేసిన పోరాటం చిరస్మరణీయం. కుల మతాలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి వంగవీటి రంగా. ఆయన పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని బడుగు బలహీన వర్గాలకు మేలు చేసినపుడే అసలైన నివాళి అర్పించినట్లు అన్నారు. కూటమి ప్రభుత్వం కూడా పేదల అభ్యున్నతి కోసం కట్టుబడి పని చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు , డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ , గోపు సత్యం , మదివాడ రాము తదితరులు పాల్గొన్నారు.