మచిలీపట్నం నగరంలో క్రిస్మస్ పండుగను క్రిస్టియన్లు, హిందువులు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు చర్చిలలో పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ గంటలు కొట్టారు. ఆ సమయంలో వందలాదిమంది క్రిస్టియన్, హిందువులు పాల్గొని దేవునికి స్తోత్రం చెప్పారు. సకల మానవాళి సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పాస్టర్ల ఆశీర్వాదం తీసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అనేకమంది కుటుంబాలతో చర్చిల వద్దకు చేరుకొని దైవ ప్రార్థనలో గడిపారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మంత్రి కొల్లు రవీంద్ర నగరంలోని పలు చర్చిలలో పాల్గొని దైవ ప్రార్థనలో పాల్గొన్నారు. చర్చిలలోని పలువురు పాస్టర్లు, ముఖ్యులు సమక్షంలో కేక్ కట్ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర తోపాటు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. అలానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నాయకుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పలు చర్చిలలో పాల్గొని ప్రార్థన చేశారు. దైవ ఆశీర్వాదం తీసుకున్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పలువురు క్రిస్టియన్లు తమ బంధువులు స్నేహితులును తమ ఇళ్లకు ఆహ్వానించి పసందైన విందును ఏర్పాటు చేశారు. కానుకలు ఇచ్చారు. ఈ సందర్భంగా బుధవారం అర్ధరాత్రి నుండి పలువురు యువకులు, మహిళలు వాహనాల్లో నగరమంతా తిరుగుతూ క్రీస్తు పాటలు పాడి తమ పిల్లలకు కానుకలు ఇచ్చి సంతోషపరిచారు.