జిల్లా వ్యాప్తంగా గ్రామ ఆరోగ్య వనాలు
SSN
- December 24, 2025
- 0 min read
[addtoany]
మచిలీపట్నం:
జిల్లా వ్యాప్తంగా గ్రామ ఆరోగ్య వనాలు ఏర్పాటు చేయుటకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు.
బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ నాగాయలంక మండలంలోని టీ కొత్తపాలెం గ్రామపంచాయతీ కార్యాలయం ముంగిట కార్యదర్శి అశోక్ చొరవతో ఏర్పాటుచేసిన గ్రామ ఆరోగ్యవనాన్ని ప్రారంభించి అందులో పెంచుతున్న సర్పగంధ, బ్రాహ్మి, రణపాల, మధునాసిని, శతావరి, కుషింద గుంటగరగరాకు, కలబంద వంటి ఔషధ మొక్కలను పరిశీలించారు.
తదుపరి అదే గ్రామంలో సర్పంచ్ శివ పార్వతి కృషితో చెత్తాచెదారాలను తొలగించి ఏర్పాటుచేసిన పార్కును జిల్లా కలెక్టర్ సందర్శించి అందులోని బల్లపై ఆమెతో కలిసి కూర్చొని కాసేపు ముచ్చటించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఔషధ మొక్కలతో గ్రామ ఆరోగ్యవనాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అన్ని కాలువ గట్టులపైన, చెరువుల చుట్టూ ఇటువంటి మొక్కలను విరివిగా పెంచడం వలన స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు.
పూర్వపు గ్రామీణ ఔషధ విజ్ఞానాన్ని పునరుద్ధరించుకోవడం మనందరి కర్తవ్యం అన్నారు. ఇందులో భాగంగా అరుదైన అంతరించిపోతున్న ఆయుర్వేద మొక్కలను సేకరించుకొని సంరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అలాగే గ్రామంలోని చెత్తకుప్పలను డంపింగ్ యార్డులను గ్రామ సర్పంచ్ బండ్రెడ్డి శివపార్వతి పంచాయతీ నిధులతో కాకుండా సొంత ఖర్చుతో తొలగించి పార్కులుగా అభివృద్ధి పరచడం స్ఫూర్తిదాయకమన్నారు. తద్వారా గ్రామ ప్రజలకు ఒక మంచి ఆహ్లాదకర వాతావరణంలో స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు. దాంతో ఆరోగ్యకరమైన జీవనం సాగించవచ్చన్నారు.
ఇదేవిధంగా జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలో కూడా గ్రామ ఆరోగ్యవనాలను ఏర్పాటు చేయుటకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
తదనంతరం జిల్లా కలెక్టర్ ఆరోగ్యవనం ఏర్పాటు చేసినందుకు, గ్రామ సేవ కింద పార్కును ఏర్పాటు చేసినందుకు కార్యదర్శి ఆది అశోక్ ను, గ్రామ సర్పంచ్ బండ్రెడ్డి శివపార్వతిని అభినందిస్తూ జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు. పార్కులోని మొక్కలు ఎండిపోకుండా నిరంతరం వాటికి నీరు పోసి బతికిస్తున్న తోటమాలి లంకె కృష్ణారావును కూడా జిల్లా కలెక్టర్ అభినందిస్తూ సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దారు ఆంజనేయ ప్రసాదు, ఎంపీడీవో ఎం చంద్రశేఖర్, గ్రామపంచాయతీ కార్యదర్శి ఆది అశోక్, సర్పంచ్ బండ్రెడ్డి శివపార్వతి , వారి భర్త శ్రీనివాసరావు, నీటి పంపిణీ కమిటీ అధ్యక్షులు నాగ మల్లికార్జునరావు తదితర అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

