MachilipatnamLocal News
December 28, 2025
కృష్ణా జిల్లా

10వ తరగతి విద్యార్థులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం

  • December 24, 2025
  • 0 min read
[addtoany]
10వ తరగతి విద్యార్థులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం
మచిలీపట్నం:
 
విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ 10 వ తరగతి పరీక్షలను ధైర్యంగా వ్రాసి మంచి మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు ఉద్బోధించారు. 
 
బుధవారం ఉదయం అవనిగడ్డ లోని విద్యానికేతన్ పాఠశాలలో అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోనీ 10 వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 
 
తొలుత జిల్లా కలెక్టర్, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి పురిటిగడ్డ తెలుగు భాష ఉపాధ్యాయురాలు డా. ఓలేటి ఉమా సరస్వతి రూపొందించిన తేనె చినుకులు అనే బడి పిల్లల కవితల పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు ఎలా రాయాలో అని భయపడవద్దని, ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటే పరీక్షలు సులభంగా వ్రాయవచ్చన్నారు. 
 
విద్యార్థులు చదువుకుంటూ పోవడం కాకుండా చదివిన తర్వాత కొంచెం సేపు కళ్ళు మూసుకుని ఆ చదివిన అంశం పైన ఎంతవరకు గుర్తుకు వస్తుందో మననం చేసుకోవాలన్నారు ఆ విధంగా చేసినప్పుడే వారికి చదివిన విషయాలపైన పట్టు సాధించవచ్చన్నారు. 
 
రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని ఆ సమయంలోనే మెదడు అప్రమత్తమవుతుందన్నారు.  ఇవన్నీ కూడా తన స్వానుభావంతో చెబుతున్నానని కలెక్టర్ తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ తాను కూడా కర్ణాటకలో ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేశానన్నారు. పదో తరగతి నుంచి తాను బాగా చదవడం మొదలు పెట్టానని, కలెక్టర్ స్థాయికి చేరుకున్నానని విద్యార్థులకు ఎలా చదువుకోవాలి ఏ పద్ధతి పాటిస్తే చదువుకున్న విషయాల పైన పట్టు సాధించవచ్చనీ అందరికీ అర్థమయ్యే రీతిలో విశదీకరించారు.
 
బాగా చదువుకుంటూ ఆహారం పైన కూడా శ్రద్ధ పెట్టాలని చాలామంది సరిగా తినకపోవడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు.
చదివేముందు నాలుగైదు సార్లు యోగాలో భాగంగా ప్రాణాయామం చేయడం కూడా ముఖ్యమన్నారు.
సమయం ఉంటే చదివిన విషయాలను వ్రాస్తే ఇంకా శక్తివంతంగా ఉంటుందన్నారు.
 
 
బాగా కష్టపడి చదవాలని పరీక్షల్లో కొద్దిగా మార్కులు తగ్గినా నిరాశ చెందవద్దని, ఒక్క పదవ తరగతితో అంతం కాదని జీవితంలో ఇంకా సాధించవలసినవి ఎన్నో ఉన్నాయన్నారు.
 
అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని విద్యార్థులందరూ బాగా చదువుకొని నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉద్దేశంతో ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం చేపట్టామన్నారు.
 
ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యం తెలుసుకొని అందుకు తగ్గట్టుగా అన్ని సబ్జెక్టులలోనూ అవగాహన కలిగించి నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలన్నారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఇందులో భాగంగానే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. 
 
వచ్చే నెలలో సాంస్కృతిక, లలిత కళల పోటీలు నిర్వహిస్తామని, అందులో ప్రతిభ చూపిన వారిని గుర్తించి ప్రోత్సహిస్తామన్నారు. ఏ కళలో ఎవరికి అభిరుచి ఉన్నా పాల్గొని వారి నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. కేవలం విద్యకే పరిమితం కాకుండా వివిధ రంగాల్లో కూడా విద్యార్థులు రాణించాలన్నారు. 
 
అనంతరం తేనె చినుకులు పుస్తకాన్ని రూపొందించిన తెలుగు ఉపాధ్యాయురాలు ఓలేటి ఉమా సరస్వతిని, విద్యానికేతన్ పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేసిన కరస్పాండెంట్ లంక ప్రసాద్ ను, కౌసల్ కార్యక్రమంలో దివిసీమలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థి చావా మోక్షజ్ఞను జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు అభినందిస్తూ ఘనంగా సత్కరించారు.
 
తదనంతరం జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి మెప్మా పీడీ సాయిబాబు, జిల్లా విద్యాధికారి సుబ్బారావు, విద్యానికేతన్ కరస్పాండెంట్ లంకే ప్రసాద్, పలువురు ఎంఈఓ లు, ఉపాధ్యాయులు, అవనిగడ్డ నాగాయలంక కోడూరు మోపిదేవి మండలాలలోని విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *