మంత్రి కొల్లు రవీంద్రను కలిసి పెట్టుబడుల గురించి వివరించారు.
త్వరలోనే ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి ఒప్పందం చేసుకుందామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ.
మచిలీపట్నం :
రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడం లక్ష్యంగా బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ మెంట్స్ ప్రతినిధుల బృందం మంత్రి కొల్లు రవీంద్ర గారిని కలిశారు. రాష్ట్రంలో కర్బన ఉద్గారాల నివారణ, పర్యావరణ పరిరక్షణ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని, వాటిలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి, ముఖ్యంగా మచిలీపట్నం పరిసరాల్లో బీచ్ టూరిజం అభివృద్ధికి నెథర్లాండ్స్ కు చెందిన ప్రతినిధులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
రెన్యూవబుల్ ఎనర్జీ రంగం, తయారీ రంగం, క్రిటికల్ మినరల్స్ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం నుండి తోడ్పాటు అందించాలన్నారు. రాష్ట్రంలో విస్తారమైన మత్స్య సంపద ఉన్నప్పటికీ.. ఆదాయం సరిగా లేదని, మత్స్య రంగంలో విలువ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.
స్థానిక యువతకు మత్స్య రంగంలో ఉపాధికి కల్పించాలన్నారు. ఈ మేరకు ఫిషరీస్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో యువతకు శిక్షణ అందించడం ద్వారా ఆక్వాలో ఏపీని దేశానికి ఆదర్శవంతంగా మారుస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికీ ప్రాధాన్యత కల్పించేలా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కోస్టల్ టూరిజం, సోలార్, ఉప్పు నీటి నుండి మంచి నీరు తయారీ వంటి అంశాలపై కేస్ స్టడీ తయారు చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా స్మార్ట్ వర్క్ చేయడం ద్వారా ఉద్యోగ, ఉపాధితో పాటుగా.. మెరుగైన ఆదాయమూ సాధించుకునే వెసులుబాటు ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
కార్యక్రమంలో యూరో ఎంటర్ప్రెన్యూర్ బ్యాంక్ ప్రతినిధి జయకుమార్, సైబస్ బయోటెక్ ఇండియా ఎండీ డా.నగేష్, బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ మెంట్స్ ప్రతినిధి దుర్గా రవీంద్రన్, అమస్టర్ డాం ఫార్మా స్టడీస్, పిలిప్స్ సంస్థ ప్రతినిధి రష్మీ తదితరులు పాల్గొన్నారు.