అక్కినేని నాగేశ్వరరావు కళాశాల విశ్వవిద్యాలయ స్థాయికి ఎదగాలి
SSN
- December 19, 2025
- 0 min read
[addtoany]
అక్కినేని నాగేశ్వరరావు విద్యాభివృద్ధికి కృషిచేసిన మహనీయుడు..
అక్కినేని నాగేశ్వరరావు కళాశాల విశ్వవిద్యాలయ స్థాయికి ఎదగాలి..
కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
గుడివాడ:
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన మహానటుడు, పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు విద్యాభివృద్ధికి కృషిచేసిన మహనీయుడని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కొనియాడారు.
గురువారం ఉదయం ఆయన గుడివాడలోని అక్కినేని నాగేశ్వరరావు కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడలో సరైన విద్యాసంస్థ లేని లోటును గమనించి ఎందరో మహనీయుల కృషితో కళాశాల ఏర్పాటు అయిందని గుర్తు చేస్తూ, నేటితరం వారందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కళాశాలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి పూర్వ విద్యార్థులు కళాశాల మరింత అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. వారి సహకారంతో కళాశాల విశ్వవిద్యాలయ స్థాయికి ఎదగాలి అని ఆకాంక్షించారు. కళాశాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం తనవంతు రూ.50 లక్షలు ప్రకటించిన ఈనాడు విద్యాసంస్థల యాజమాన్యాన్ని అభినందిస్తూ, వారే దానిని నిర్వహించేలా చూడాలని కోరారు.
విద్యావ్యవస్థలో సంస్కరణలు అవసరమని చెబుతూ, అవి ఉపాధి అవకాశాలను పెంపొందించే విధంగా నైపుణ్యాభివృద్ధితో కూడిన మార్పులు ఉండాలని ఆకాంక్షించారు.
యువత చదువుతోపాటు సంస్కారాన్ని పెంపొందించుకోవాలని, పదిమందికి ఉపయోగపడే విధంగా ఆదర్శవంతమైన జీవితం జీవించాలన్నారు. కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులను విడనాడకుండా కడవరకు వారి బాగోగులను చూడాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు. యువత మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు లోను కాకుండా వాటికి దూరంగా ఉండాలన్నారు. అవసరం మేరకు సాంకేతికతను ఉపయోగిస్తూ దుర్వినియోగాన్ని నిరోధించాలని, ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడుపుతూ సమయాన్ని వృధా చేసుకోవద్దని, బదులుగా సబ్జెక్టు, జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో దృష్టి పెట్టాలని విద్యార్థులకు ఉద్బోధించారు.
ప్రపంచ దేశాలలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకు దూసుకెళుతోందని, రాబోయే కాలంలో అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందన్నారు. సమాజంలో, కళాశాలలో, కుటుంబంలో అందరూ ఐక్యమత్యంగా ఉండాలని తద్వారా దేశ అభివృద్ధి వేగంగా ముందుకు సాగేందుకు తోడ్పాటునందించాలని మాజీ ఉపరాష్ట్రపతి కోరారు.
కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, గుడివాడ, పామర్రు, కైకలూరు నియోజకవర్గాల శాసనసభ్యులు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, డాక్టర్ కామినేని శ్రీనివాసరావు, మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి కూన రాంజీ, కేంద్ర విజిలెన్స్ మాజీ కమిషనర్ కేవీ చౌదరి, వజ్రోత్సవ కమిటీ చైర్మన్ కే శ్రీనివాసరావు, అక్కినేని కుటుంబ సభ్యులు అక్కినేని వెంకట్, జ్యోత్స్న, కళాశాల ప్రిన్సిపల్ పి జే ఎస్ కుమార్, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

