కృష్ణా జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ విజయవాడలోని కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. డీసీఎంఎస్ పరిధిలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు రైతులకు చౌక ధర దుకాణాల ద్వారా అందిస్తున్న ఎరువుల వివరాలను, డిసిఎంఎస్ పరిధిలో ఉన్న భూములను, గిడ్డంగులను, మూల నిధులు రావలసిన నిధుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్కెటింగ్ సొసైటీ ద్వారా జరిగిన వ్యాపార లావాదేవీలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
డీసీఎంఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాల ఆక్రమణలను తొలగించి స్వాధీన పరుచుకుని రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశామని అనుమతులు రాగానే ఖాళీ స్థలాలను గోడౌన్లుగా,కళ్యాణ మండపాలుగా తీర్చిదిద్ది డిసిఎంఎస్ ఆదాయ వనరులు పెంచుతామన్నారు. రైతు శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, అన్నదాతకు మేలు చేసే విధంగా కృష్ణా జిల్లా కో-ఆపరేటివ్ మార్కెట్ సొసైటీ కృషి చేస్తుందని అన్నారు.
జనరిక్ ఔషధ దుకాణాలనుఏర్పాటుచేసి ప్రజలకు తక్కువ ధరకు మందుల విక్రయాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. రైతులకు ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో అవగాహన కల్పించి ఆ పంటలను ప్రోత్సహిస్తామన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్న పంటలపై దృష్టి కేంద్రీకరించి వాటిని మన నేలలో పండించే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. అందరూ ఒకే రకమైన పంటలను పండించడం వల్ల గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోవలసిన పరిస్థితి వస్తుందని దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి డిమాండ్ ఉన్న పంటలను ప్రోత్సహించి తద్వారా రైతుకు లాభదాయకమైన పంటలను పండించేందుకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బిజినెస్ మేనేజర్ యు.వి.ప్రసాద్ రావు, మేనేజర్ ఆర్.రమేశ్ బాబు (ఓ ఎస్ డి), వి.సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితరులు పాల్గొన్నారు.