ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి జిల్లాలో అత్యధికంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా 149 కంబైన్డ్ హార్వెస్టర్లు వరి కోతలు కోయడంతో ఎక్కువగా ఒకేసారి ధాన్యం సేకరణ చేయవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఈ పరిస్థితులలో ప్రభుత్వం పెద్ద ఎత్తున గోనెసంచులను, వాహనాలను సమకూర్చినప్పటికీ సరిపోవడం లేదన్నారు. మిల్లర్లు వారి వద్ద ఉన్న గోనెసంచులను, వాహనాలను కూడా కావలసినంతగా సమకూర్చి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహకరించాలన్నారు.
జిల్లాలో 75% వరి కోతలు పూర్తయ్యాయన్నారు.
ప్రస్తుతము 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉందన్నారు. ఆ ధాన్యాన్ని తీసుకొనుటకు మిల్లర్లందరూ సిద్ధంగా ఉండాలన్నారు. రోజుకు 20 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరించుటకు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలన్నారు.
అంతేకాకుండా బ్యాంకు గ్యారంటీలను కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. రైతులు కోత కోసిన వెంటనే ధాన్యాన్ని తీసుకొస్తున్నారని దానిని బాగా ఆరబెట్టుకునేందుకు వీలుగా మిల్లర్ల వద్ద ఉన్న డ్రైయర్లను వినియోగించుకునేలా చూడాలన్నారు. జిల్లాలో రైతులు ఎక్కువగా 1318 రకం వరి పండిస్తున్నారని ఆ ధాన్యాన్ని కూడా తప్పకుండా
తీసుకోవాలన్నారు.
సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు మరో 10 లక్షల గోనే సంచులు త్వరలో రానున్నాయన్నారు.
ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు శివరాం ప్రసాద్, జిల్లా మిల్లర్ల సంఘం అధ్యక్షులు వీరయ్య, పలువురు మిల్లుల యజమానులు పాల్గొన్నారు.