ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంకు 151 అర్జీలు
SSN
- December 15, 2025
- 0 min read
[addtoany]
ప్రజల నుండి అందుతున్న మీకోసం అర్జీలను అత్యధిక ప్రాధాన్యతతో శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, అదనపు ఎస్పీ సత్యనారాయణ కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, మచిలీపట్నం ఆర్డిఓ స్వాతిలతో కలసి నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల బాధలు సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో అర్జీలను పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు సంబంధించిన నివేదికలను సాయంత్రంలోగా తనకు అందజేయాలని ఆదేశించారు.

ఆ ప్రకారం కలెక్టరేట్లో మొత్తం 151 అర్జీలు వారు స్వీకరించారు. అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:
కృష్ణాజిల్లాలో ప్రాథమిక వైద్య కేంద్రాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు చాలా సమస్యలతో బాధపడుతూ ఉద్యోగాలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ కృష్ణాజిల్లా స్ట్రగుల్ కమిటీ జిల్లా కార్యదర్శి సౌమ్య రేఖ పలువురు స్టాఫ్ నర్సులు కలిసి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదుఅర్జీ అందజేశారు. జిల్లాలో అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాల్లో ముగ్గురు స్టాఫ్ నర్సులు మాత్రమే మూడు షిఫ్టులలో పని చేస్తున్నారని, ఒకరోజు తీసుకునే డే ఆఫ్ (వీక్లీ ఆఫ్) ఇవ్వడానికి వైద్యాధికారి నిరాకరిస్తున్నారని, అత్యవసర సమయంలో కూడా సాధారణ సెలవు ఇవ్వడానికి వైద్యాధికారి నిరాకరిస్తున్నారని ఆ అర్జీలో పేర్కొన్నారు. రాత్రి షిఫ్ట్ లో భద్రతా సిబ్బంది లేదా సపోర్టింగ్ షాప్ లేకుండా మహిళా స్టాఫ్ నర్స్ ఒకరు మాత్రమే అభద్రత భావంతో విధులు నిర్వహించాల్సి వస్తుందని ఆరోపించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నాలుగవ స్టాఫ్ నర్స్ సపోర్టింగ్ స్టాఫ్ ను ఏర్పాటు చేయాలని అందులో కోరారు..

కృష్ణాజిల్లాలో రైతులు తమ వరి ధాన్యం అమ్ముకునేందుకు గోనె సంచులు, వాహనాల కొరత తీవ్రంగా ఉందని రైతు సేవా కేంద్ర ద్వారా గోనె సంచులు సరఫరా చేయాలని, కొనుగోలు కేంద్రాల సంఖ్య మరింత పెంచాలని, తేమ శాతం ఎక్కువగా ఉందంటూ ఒక్కో క్వింటాకు 12 కిలోలు తరుగు తీసి లెక్క కడుతున్నారని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కొనుగోలు కేంద్రానికి ఏ రోజున దాన్యం తీసుకువెళ్లాలో ముందుగానే రైతులకు సమాచారం అందించాలని, 1318 రకం వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం రాశులు రహదారిపై గుట్టలుగా నిలిచిపోతున్నాయని, ధాన్యం కొనుగోలు విధానాన్ని సమీక్షించేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కోరుతూ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కృష్ణా జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆది రామ్మోహన్రావు అర్జీ అందజేశారు.
కృత్తివెన్ను మండలం చినగొల్ల పాలెంనకు చెందిన వయోవృద్ధులు బొగ్గవరపు గోపాలకృష్ణ తన సతీమణి జ్యోతి సహాయంతో చక్రాల కుర్చీలో కలెక్టరేట్కు రాగా జిల్లా కలెక్టర్ నేరుగా అతని వద్దకు వచ్చి అతని బాధలను ఎంతో ఓపికగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ తన కుమారుడు తన ఆస్తి అంతా రాయించుకొని తనను పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ సీనియర్ సిటిజన్ చట్టం కింద ప్రతినెలా 10 వేల రూపాయలు ఇప్పించే ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ అతనికి ధైర్యం చెప్పారు. పింఛను వస్తుందా అని కలెక్టర్ అడుగగా అతను తనకు పించను వస్తుందని చెప్పారు.
గతంలో తాను వైయస్సార్ అభయ హస్తం పథకంలో ప్రతినెల కొంత మొత్తము చెల్లించాలని, పింఛను కింద మార్పు చేయాలని కోరుతూ మచిలీపట్నం బుడ్డాయపాలెం కి చెందిన జొన్నల రంగనాయక అభ్యర్థన పత్రం అందజేశారు.
ఉయ్యూరు నగర పంచాయతీ కొబ్బరి తోట కాపురస్తులు పడాల రమణ అర్జీ అందజేస్తూ తనకు 52 సంవత్సరాల వయస్సు అని, ఎలాంటి జీవనాధారం లేదని, తనకు భార్య కుమారుడు కుమార్తె ఉన్నారని, 2018లో ప్రమాదవశాత్తు రెండు కాళ్లు ఎముకలు విరిగిపోయాయని, 6 నెలలుగా వైద్యం చేయించుకుంటున్నానని, చేతులు కూడా పనిచేయడం లేదని, తనకు 71% వికలత్వం ఉన్నట్లు డాక్టర్ ధృవీకరణ పత్రం ఇచ్చారని, తాను అనేకసార్లు దివ్యాంగుల పింఛను కోసం దరఖాస్తు పెట్టుకున్నానని, ఇంతవరకు మంజూరు కాలేదని ఇప్పుడైనా దివ్యాంగుల పింఛను మంజూరు చేయాలని కోరారు.
కృత్తివెన్ను మండలం మునిపెడ గ్రామ నివాసి వాసిపల్లి అజ్నేసమ్మ తాను ఎస్సీ కులానికి చెందిన దాననని, తన భర్త గుండె నొప్పితో చనిపోయారని, తనకు ఒక కుమారుడు ఉన్నారని, జీవనాధారం ఏదీ లేదని, వితంతు పింఛను మంజూరు చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, డ్వామా పీడీ శివప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ సోమశేఖరు, డిఎస్ఓ మోహన్ బాబు, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, డిపిఓ డాక్టర్ జె అరుణ, జిల్లా ఉద్యాన అధికారి జె జ్యోతి, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి పోతురాజు, ఆర్ అండ్ బి ఈ ఈ లోకేష్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

