డిసెంబర్ 14 జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం
SSN
- December 14, 2025
- 1 min read
ఎనర్జీ ఎఫిషియెన్సీ బ్యూరో (Bureau of Energy Efficiency – BEE) భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం (National Energy Conservation Day) నిర్వహిస్తుంది.
ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించడం పై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇంధన వనరులు పరిమితమైనవి. విద్యుత్ ఉత్పత్తి వల్ల కాలుష్యం పెరుగుతుంది. ఇంధన ఆదాతో ఖర్చులు తగ్గుతాయి. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్ తరాలకు వనరులు కాపాడబడతాయి.
పునరుత్పాదక ఇంధనం (Renewable Energy) అంటే మళ్లీ మళ్లీ సహజంగా లభించే ఇంధన వనరుల నుండి పొందే శక్తి. పునరుత్పాదక ఇంధనం లో సౌర శక్తి (Solar Energy) (సూర్య కిరణాల), వాయు శక్తి (Wind Energy) (గాలిచలనం), జల విద్యుత్ (Hydro Power) (నీటి ప్రవాహం), జీవ ఇంధనం (Biomass Energy) (వ్యవసాయ వ్యర్థాలు, చెత్త), భూగర్భ ఉష్ణశక్తి (Geothermal Energy) (భూమి లోపలి ఉష్ణం) వంటి రకాలున్నాయి.
పునరుత్పాదక ఇంధనం వల్ల కాలుష్యం తగ్గుతుంది, ఇంధన కొరత ఉండదు, పర్యావరణం పరిరక్షించబడుతుంది. దాని వల్ల భవిష్యత్తు తరాలకు ఉపయోగకరం.
పునరుత్పాదక ఇంధనంలో సౌర ఇంధనం వినియోగానికి ప్రభుత్వం ప్రోత్సహం అందిస్తుంది. బొగ్గు, నీరు, గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాల వద్ద ప్రభుత్వాలు విద్యుత్ ను కొనుగోలు చేసి విధ్యుత్ తీగల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు వినియోగదారులకు సరఫరా చేసున్నాయి. దాంతో నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి, సరఫరా ప్రభుత్వానికి వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. కానీ వినియోగదారులే స్వయంగా వారి అవసరాలకు తగినంత విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోవడం… మిగులు విద్యుత్ ను విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయడం…. తద్వారా విద్యుత్ కేంద్రాల నుంచి ఆదాయం పొందటం పీఎం సూర్య ఘర్ ముఫ్తి బిజిలి యోజన ద్వారా సాధ్యపడుతుంది. విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేసే ప్రతి యూనిట్ విద్యుత్ కు విద్యుత్ కేంద్రాలు డబ్బులు చెల్లిస్తాయి.
సౌర విద్యుత్ పై కేంద్ర ప్రభుత్వ రాయితీ మరియు బ్యాంకు ఋణ సౌకర్యం
భగభగ మండే సూర్యుని కిరణాలను సౌర ఫలకాల ద్వారా ఆహ్వానించి బ్యాటరీ లో బంధించి విద్యుత్ రూపంలో మన ఇంటి అవసరాలకు వాడుకొని … మిగులు విధ్యుత్ ను విద్యుత్ సంస్థలకు యూనిట్ రూ 2.09 కు విక్రయించుకోవచ్చు. సౌర విధ్యుత్ కేంద్రం ఏర్పాటు చేసుకునే వారికి దేశం మొత్తం మీద రూ.75,021 కోట్లు సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
2023-24 నుంచి 2026-27 వరకు పీఎం సూర్య ఘర్ ముఫ్తి బిజిలి యోజన పథకం కింద ఈ సబ్సిడీ మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ పథకం కింద 1-2 కిలోవాట్ సామర్ధ్యానికి 60% సబ్సిడీ, 3కిలోవాట్ సామర్ధ్యానికి 40% సబ్సిడీ ప్రభుత్వం అందచేస్తుంది. గరిష్టంగా రూ. 78,000 సబ్సిడీ లభిస్తుంది.
అవసరమైన వారికి బ్యాంకు ద్వారా ఋణ సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించడం ఈ పధకంలో ప్రత్యేకత. ఉదాహరణకు సుమారుగా సౌర విధ్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు రూ 1.5 లక్షలు ఖర్చు అయితే గరిష్టంగా రూ. 78,000 సబ్సిడీ ప్రభుత్వం భరిస్తుంది. మిగతా మొత్తాన్ని అవసరమైన వారికి బ్యాంకు నుండి పూచీకత్తులేని ఋణంగా అందచేస్తుంది.
శ్యామ్ కాగిత,
మచిలీపట్నం

