మచిలీపట్నం:
జిల్లాలో గృహ నిర్మాణం పనులు వేగవంతం చేయుటకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో గృహ నిర్మాణ పురోగతిపై సమావేశం నిర్వహించి సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 24,133 గృహాలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 121 గృహాలు మాత్రమే పూర్తి చేయడం జరిగిందన్నారు.
మిగిలిన గృహాలలో 719 గృహాలు బిబిఎల్ దశలో, 2770 గృహాలు బి ఎల్ దశలో, 119 గృహాలు ఆర్ సి దశలో ఉన్నాయన్నారు. ఈనెల 8 వ తేదీన సమీక్షించినప్పటి నుండి ఇప్పటివరకు సరైన పురోగతి కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పైకప్పు దశ నుండి రూఫ్ క్యాస్ట్ దశ వరకు కేవలం 30ఇళ్లు మాత్రమే వచ్చాయన్నారు. ఆర్సీ నుండి కేవలం 18 గృహాలు మాత్రమే పూర్తి స్థాయికి వచ్చాయన్నారు.
కృత్తివెన్ను, నందివాడ, గుడివాడ, ఉయ్యూరు తదితర మండలాల్లో ఎలాంటి పురోగతి సాధించలేదన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి గృహ నిర్మాణం పురోగతిపై పదేపదే సమీక్షిస్తున్నారని, ఉగాది నాటికి అన్ని గృహాలు పూర్తి చేయాలని ఆదేశించారన్నారు. గృహాల నిర్మాణంలో ఆలస్యం చేస్తే ఆ పథకం ముగిసిపోతుందని హెచ్చరించారు.
గృహ నిర్మాణంలో ఎంపీడీవోలు గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లతో సమన్వయం చేసుకొని నిర్ణీత లక్ష్యాలను సాధించాలన్నారు.
పెడన మండలంలో తక్కువ దశలో ఉన్న ఇంటికి ఎక్కువ దశలో ఉన్నట్లుగా చూపి బిల్లు చెల్లింపు చేయడం సరైనది కాదని హెచ్చరిస్తూ అందులకు బాధ్యులైన వారికి వెంటనే షో కాస్ నోటీస్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అంతేకాకుండా అధికంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి రాబట్టాలని స్పష్టం చేశారు.
గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో కార్యదర్శులను వినియోగించి చేపట్టిన ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమం జిల్లాలో కేవలం 10 శాతం పూర్తి అయిందని, ప్రత్యేక శ్రద్ధ వహించి సర్వేని మరింత ముమ్మరం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ ఈ ఈ వెంకటరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ సోమశేఖర్, గ్రామ వార్డు సచివాలయాల సమన్వయకర్త రవికాంత్, మండల ప్రత్యేక అధికారులు జెడ్పి డిప్యూటీ సీఈఓ ఆనందకుమార్, డిఈఓ సుబ్బారావు, వయోజన విద్య డిడి బేగ్, పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, డి ఎల్ డి వో లు పద్మ, రాజేషు, సునీత శర్మ, పలువురు ఎంపీడీవోలు గృహ నిర్మాణ సంస్థ డీఈలు, ఏఈ లు పాల్గొన్నారు.