మచిలీపట్నం:
జిల్లాలో గ్రీన్ క్లైమేట్ ఫండ్ తో మత్స్య సంపద పెంపుదలకు మత్స్యకారుల జీవనోపాదులకు ముమ్మరంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో గ్రీన్ క్లైమేట్ ఫండ్ వినియోగంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా సముద్రతీరం ఉన్నందున మత్స్య సంపద పెంపుదలకు తద్వారా మత్స్యకారుల జీవనోపాదులకు ఎంతగానో అవకాశాలు ఉన్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం గ్రీన్ క్లైమేట్ ఫండ్ ద్వారా మత్స్యకారుల జీవనోపాదుల పెంపుదలకు 100 శాతం రాయితీతో నిధులు ఇచ్చి తోడ్పడుతోందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 12 యూనిట్ల అలంకార చేపలు ఒక్కొక్కటి 45,948 రూపాయల చొప్పున కోడూరు, నాగాయలంక మండలాల్లో త్వరలో నెలకొల్పుటకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే 27 యూనిట్ల పీతల పెంపకం యూనిట్లను ఒక్కొక్కటి 19,404 రూపాయల చొప్పున ఇప్పటికే నెలకొల్పడం జరిగిందన్నారు.
అంతేకాకుండా వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరంలో అలంకార చేపలకు సంబంధించి మరో 100 యూనిట్లు నెలకొల్పుటకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరంలో పీతల పెంపకం సంబంధించి మరో 500 యూనిట్లు నెలకొల్పుటకు, సముద్ర నాచు పెంపకానికి సంబంధించి 100 యూనిట్లు నెలకొల్పాలన్నది లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.
ఇందుకు తగ్గట్టుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సంబంధిత లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలన్నారు.
సముద్ర నాచు పెంపకానికి సంబంధించి ఈ సంవత్సరం తొలి దశలో 5 యూనిట్లు ఒక్కొక్కటి 11663 రూపాయల చొప్పున నెలకొల్పి ప్రయోగాత్మకంగా పరిశీలన జరిపి ఆ తరువాత మిగిలిన యూనిట్లు కూడా నెలకొల్పాల్సి ఉందన్నారు.
రానున్న రోజుల్లో అలంకార చేపలు, పీతలు, సముద్ర నాచు పెంపకంపై మత్స్యకారులకు శిక్షణ ఇవ్వాలని, ప్రదర్శనశాల ఏర్పాటు చేసి మత్స్య సంపద డీలర్లను కూడా పిలవాలన్నారు.
ఈ సమావేశంలో మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజ, డిఆర్డిఏ పి డి హరిహరనాథ్, డీఎఫ్ఓ సునీత గ్రీన్ క్లైమేట్ ఫండ్ రాష్ట్ర ప్రాజెక్టు మేనేజర్ ఉషా, జిల్లా సమన్వయకర్త బి ప్రభాకర్ పాల్గొన్నారు.