[addtoany]
గుడివాడలో 69వ జాతీయ పాఠశాల అండర్ -14 బాలికల కబడ్డీ క్రీడా పోటీలను ప్రారంభించిన జిల్లా ఇంచార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్
గుడివాడ:
క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని, క్రీడల్లో గొప్పగా రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, వైద్య బీమా సేవల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ క్రీడాకారులకు ఉద్బోధించారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుడివాడలోని నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న 2025-2026 సంవత్సర 69వ జాతీయ పాఠశాల అండర్ -14 బాలికల కబడ్డీ క్రీడా కార్యక్రమంలో సోమవారం మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలను ప్రారంభించారు. శాప్ చైర్మన్ రవి నాయుడు, ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యుడు వెనిగండ్ల రాము, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి గాల్లోకి బెలూన్లు ఎగరవేసి క్రీడలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అనంతరం వారు తెలంగాణ, నవోదయ విద్యాలయ సంఘటన్ జట్ల మధ్య జరిగిన తొలి కబడ్డీ మ్యాచ్ను తిలకించారు. తొలుత మంత్రి, ఇతర ప్రజా ప్రతినిధులు సరదాగా కాసేపు కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
కార్యక్రమంలో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలు మానసిక స్థైర్యం, పోటీ తత్వాన్ని, ఓటమిని స్వీకరించే క్రీడా స్ఫూర్తిని నేర్పిస్తాయని, అవి మనిషి జీవిత ఎదుగుదలకు ఎంతో తోడ్పాటునందిస్తాయన్నారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో రాణించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగవచ్చని, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పాఠశాలల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గొప్పగా రాణించాలని మంత్రి ఆకాంక్షించారు.
శాప్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ కు ముందు తర్వాత క్రీడలను ఎంతో ప్రోత్సహించి క్రీడాకారులకు ఎన్నో ప్రోత్సాహకాలను అందించిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు క్రీడలపై మక్కువతో ఎన్టీఆర్ స్టేడియాన్ని నిర్మించి క్రీడలను ప్రోత్సహించారన్నారు.
ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ సుప్రసిద్ధ భారతీయ హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ వంటి గొప్ప క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని రాణించాలని ఆకాంక్షించారు.
శాసనసభ్యుడు వెనిగండ్ల రాము మాట్లాడుతూ ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయస్థాయి క్రీడలు నిర్వహించటం గుడివాడకు ఎంతో గర్వకారణం అన్నారు. ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమంలో నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ భానుమూర్తి, మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు సిహెచ్ రవి, పొట్లూరి రవి, గుడివాడ మున్సిపల్ కమిషనర్ మనోహర్, డీఈవో యు వి సుబ్బారావు, డి ఎస్ డి ఓ ఝాన్సీ లక్ష్మి, క్రీడాకారులు, క్రీడా శిక్షకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

