మచిలీపట్నం :
జిల్లాలో వాయు కాలుష్యం ధ్వని కాలుష్యం నివారణకు పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్ సైకిళ్లు ఎంతగానో తోడ్పడతాయని, ఈనెల 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిచే వర్చువల్ గా ప్రారంభించే ఏర్పాట్లను వెంటనే చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
ప్రకృతిలో రాను రాను వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యము అధికమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పర్యావరణం కలుషితమై మానవుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతోందన్నారు. దీన్ని నివారించడం కోసం ప్రతి శనివారము కలెక్టరేట్లోపలికి సైకిళ్లపైన గాని లేదా కాలినడకన గాని రావాలని జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు సూచించడం జరిగిందన్నారు.
ఈనెల 31వ తేదీన కుప్పంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలక్ట్రిక్ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున లాంచనంగా ప్రారంభిస్తున్నారన్నారు. .
ఇందులో భాగంగా జిల్లాలో కూడా తొలి దశలో 500 ఎలక్ట్రిక్ సైకిల్ ల పంపిణీకి ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించే ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలన్నారు. ఇందుకోసం ఈనెల 27వ తేదీ నాటికి ఎలక్ట్రిక్ సైకిల్లు జిల్లాకు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఒక్కో ఎలక్ట్రిక్ సైకిల్ విలువ 23,999 రూపాయలు అవుతుందని, 24 నెలల పాటు ఈఎంఐ ద్వారా కూడా చెల్లించవచ్చని, అవసరమైనప్పుడు బ్యాటరీ చార్జి చేసుకోవచ్చని, ఈ సైకిల్ తొక్కడం ఎంతో సులభమని, ఈ సైకిల్ వాడటం వలన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించిన వారమవుతామన్నారు.
జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ– సైకిల్ కొనుగోలుకు ముందుకు రావాలన్నారు.
మండలాల వారీగా ఎలక్ట్రిక్ సైకిళ్లు కొనుగోలు చేయనున్న వారి జాబితాను సిద్ధం చేసి ఈ—- సైకిళ్ళు సరఫరా చేసే ఈ మోటోరాడ్ కంపెనీకి అందజేయాలన్నారు.
రెండు డెమో సైకిళ్లను కూడా జిల్లా కేంద్రంలో వెంటనే అందుబాటులో ఉంచాలని కలెక్టర్ కంపెనీ నిర్వాహకులకు సూచించారు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ సైకిళ్ళు విడిభాగాలను కలుపుట, వాడకంపై కొంతమంది యువతీ యువకులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం ఉత్సాహం ఉన్న యువతను ఎంపిక చేయాలని కలెక్టర్ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి నరేష్కు సూచించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర్ చంద్రశేఖర రావు రావు డి ఆర్ డి ఎ పి డి హరిహరనాథ్ ఈ మోటోరాడ్, పూణే కంపెనీ వ్యవస్థాపకులు కపిల్ మాండలిక్, దక్షిణ ప్రాంత ప్రతినిధి దర్శన్ పాల్గొన్నారు.