MachilipatnamLocal News
March 4, 2026
స్పెషల్ స్టోరీ

సీఎం కార్యదర్శి మిశ్రా పై జిల్లా ప్రజల ఆగ్రహం

  • March 4, 2026
  • 1 min read
[addtoany]
సీఎం కార్యదర్శి మిశ్రా పై జిల్లా ప్రజల ఆగ్రహం
శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ 
 
 మచిలీపట్నం :
 

        కలెక్టర్ అంటే జిల్లాకు పెద్ద. ఎస్పీ అంటే జిల్లా పోలీస్ బాస్. కలెక్టర్ కావడం అంటే మామూలు విషయం కాదు. అందుకోసం దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్ష సివిల్స్ లో టాపర్గా నిలవాలి. ఈ పరీక్షలో విజయం సాధించడమంటే, వారు దేశంలోనే అత్యంత ప్రతిభావంతులుగా కీర్తించబడతారు. సివిల్స్ కు ఎంపికైన వారు కేవలం వ్రాత పరీక్ష లో విజయం సాధిస్తే సరిపోదు, వారి యొక్క సమయస్ఫూర్తి, ఖచ్చితత్వం, చురుకుదనం, మాటతీరు, భావ వ్యక్తికరణ అన్నింటా వడపోసి మరీ సివిల్స్ అధికారిని ఎంపిక చేస్తారు. 

 
      దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోస్టు ఐఏఎస్(సివిల్స్ ).  ఐఏఎస్ అధికారికి ఎలాంటి షూ ధరించాలి, ఎలా ప్రవర్తించాలి అని చెప్పడమంటే… అలా చెప్పిన వారిని ఖచ్చితంగా ఒక దురహంకారపూరితమైన వ్యక్తి అని అనక తప్పదేమో! అలాంటి అమర్యాదపూర్వక చర్య ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా – కృష్ణా జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ, జిల్లా ఎస్పి వి వి విద్యాసాగర్ నాయుడు మధ్య చోటు చేసుకుంది. దాంతో ఒక ఐఏఎస్ అధికారితో మరో ఐఏఎస్ అధికారి అనుచితంగా వ్యవహరించడం తీవ్ర చర్చనీయంశమైంది. 
 
       కృష్ణా జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ, కృష్ణా జిల్లా ఎస్పి వి వి విద్యాసాగర్ నాయుడు పట్ల ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా అనుచితంగా వ్యవహరించినట్లు ఒక ప్రముఖ దిన పత్రిక వార్త ప్రచురించింది. 
 
పత్రికా కథనం ప్రకారం 
 
       ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్ర పర్యటన ముగిసిన అనంతరం అధికారులంతా గన్నవరం ఎయిర్పోర్టు లాంజ్ లో ఉండగా అక్కడికి సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా వచ్చారు. కృష్ణా కలెక్టర్ డీకి బాలాజీని పిలిచి… టై కట్టుకోవడమేమిటి? కోటు అలాగేనా వేసుకునేది, లేస్ ఉన్న షూస్ వేసుకోలేదంటూ మండిపడ్డారు. అనూహ్య ఘటనతో బాలాజీ ఒక్కసారిగా విస్తుపోయారు. అదేం లేదు సార్, అంటూ నవ్వుతూ సర్దుకుపోయే ప్రయత్నం చేశారు. ఏం నవ్వుతున్నావ్? తమాషాగా ఉందా? అంటూ మరింత గా మిశ్రా రెచ్చిపోయారు. ఆగకుండా ఐదారు నిమిషాల పాటు అందరూ వినేలా నోటికి పని చెప్పారు.
 
       అంతటితో శాంతించకుండా పక్కనే ఉన్న కృష్ణా జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడిని తన దగ్గరికి వచ్చాక సిదా ఖడో (సరిగ్గా నిల్చో) అంటూ హుకుం జారీ చేశారు. సర్, నేను సరిగ్గానే ఉన్నాను అని అంటుండగా ఏమిటి నోరు లేస్తోంది తమాషాలు చేయకు అని అరిచారు. హుందాగా వ్యవహరించవలసిన సీనియర్ అధికారి ఇష్టారీతిన వ్యవహరించడంతో అక్కడున్న అధికారులు విస్తు పోయారు.
 
        ఆయన అంతటితో ఊరుకోకుండా… కలెక్టర్ కు కొరియర్ లో’ లేస్ ఉన్న బూట్లు పంపినట్లు తెలిసింది. ఈ వార్త కృష్ణా జిల్లా అధికార యంత్రాంగంతో పాటు, జిల్లా పోలీస్, జిల్లా ప్రజలను కోపోద్రిక్తుల్ని చేసింది. 
 
        సీఎం కార్యదర్శి అంటే స్కూల్ హెడ్మాస్టర్ అనుకుంటున్నారా? తన తోటి అధికారులు స్కూలు పిల్లలు అనుకుంటున్నారా?  ఐఏఎస్ అధికారి కి డ్రెస్ కోడ్ గురించి, షూ గురించి చెప్పడం, ఐపీఎస్ అధికారికి ఎలా నిలబడాలో చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అంటూ జిల్లా అధికారుల నుండి, జిల్లా ప్రజల నుండి తీవ్ర అసహనం, వ్యతిరేకత వినిపిస్తుంది.
 
డి కె బాలాజీ శైలి 
 
      సౌమ్యూడిగా, నిరాడంబరుడిగా, కష్టపడే అధికారిగా, వివాదరహితుడిగా పేరున్న బాలాజీ, తన విలక్షణమైన పనితీరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి చేత పలు సందర్భాలలో ప్రశంసలు పొందడమే కాకుండా బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు సైతం దక్కించుకున్నారు. గత సంవత్సరం ముసోలినీలో జరిగిన కలెక్టర్ల శిక్షణలో సైతం టాపర్ గా నిలిచారు. అవార్డులతో పాటు తన పనితీరుతో ప్రజల నుండి సైతం మెప్పు పొందుతూ ముందుకు సాగుతున్నారు.
 
       అలాగే యువ ఐపీఎస్ అధికారి విద్యాసాగర్ సైతం తనదైన శైలిలో శాంతి భద్రతల పరిరక్షణలో దూకుడుగా వ్యవహరిస్తూ జిల్లా ప్రజల మన్ననలు పొందుతున్నారు.
 
      అలాంటి అధికారులను ముఖ్యమంత్రి కార్యదర్శి మిశ్రా  నిష్కారణంగా అవమానించడం తగదు.  జిల్లా కలెక్టర్ ను అవమానించడమంటే జిల్లా ప్రజలను అవమానించినట్లే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతుంది. దీనిపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి మిశ్రా పై శాఖాపరమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. 
 
శ్యామ్ కాగిత 
మచిలీపట్నం 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *