మచిలీపట్నం:
నిందితులను రోడ్లపై పోలీసులు నడిపించటం పై ఏపీ హైకోర్టులో దాఖలైన పిల్ పై విచారణ
కేసు నమోదైన నిందితులను తమ ఇష్టానుసారంగా రోడ్లపై నడిపిస్తూ అవహేళనకు గురి చేస్తున్నారంటూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ అండ్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంటల్ రైట్స్, విజయవాడ జిల్లా అధ్యక్షుడు పరసా సురేష్ కుమార్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై ఫిబ్రవరి 4, 2026న జరిగిన విచారణలో ప్రభుత్వం తరఫు న్యాయవాది అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదిస్తూ కొవ్వూరులో నిందితుడిని తీసుకువెళ్ళే వాహనం బ్రేక్ డౌన్ అవ్వడంతో రోడ్డుపై వెళ్తుండగా ఫొటోలు తీశారని కోర్టుకి తెలిపారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తన వాదన వినిపిస్తూ ఇలాంటి ఘటనలు అనేకం రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయని, ఇది చట్టవిరుద్ధమైన చర్యగా పేర్కొన్నారు. పోలీసులు నిందితులను నడి రోడ్డుపై నడిపించడం తో పాటు బహిరంగంగా తెనాలిలో యువకులను కొట్టిన అంశాన్ని సైతం కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
పోలీసులు చట్టాన్ని చేతులలోకి తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల తీరు చట్టవిరుద్ధంగా ఉంది. పోలీసుల తీరును నిలువరించాల్సిన అవసరం ఉంది. పోలీసులు ప్రభుత్వం మెప్పు పొందేందుకు నిందితుల ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నారని వాదనలు వినిపించిన శ్రవణ్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిందితుల పట్ల ప్రవర్తించిన తీరును వీడియోలు, ఫోటోల రూపంలో న్యాయమూర్తి కి అందజేసిన న్యాయవాది శ్రవణ్ కుమార్
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, చల్లా గుణరంజన్ తో కూడిన ధర్మాసనం జడ శ్రవణ్ వాదనలతో ఏకీభవించింది. పోలీసులు ప్రజలతో వ్యవహరించే తీరు బాగుండాలి. కొన్ని వీడియో లలో పోలీసులు ఇష్టారీతిన తిడుతున్నట్టు ఉంటుంది. పోలీసులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకూడదు. ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా చూసుకోవాలని హైకోర్టు పేర్కొంది.
ఈ విషయమై రాష్ట్ర డిజిపి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణ జిల్లాల ఎస్పీలు నాలుగు వారాలలోగా ప్రమాణ పత్రం దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.