మచిలీపట్నం మార్చి6, 2026, SSN:
మార్చి 8 వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని తన క్యాంపు కార్యాలయం నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణ ఏర్పాట్లపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 8 వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా స్థాయి సమావేశం తో పాటు నియోజకవర్గాల వారీగా ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి జిల్లా స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించామన్నారు. ఆ అధికారి స్థానిక ప్రజాప్రతితులు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో డిఆర్డిఏ ఏపిఎం లు, పోలీసులతో సమన్వయం చేసుకొని సజావుగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలన్నారు ముఖ్యంగా మహిళ వ్యాపారవేత్తలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల ప్రదర్శనశాలలు కూడా ఏర్పాటు చేయాలన్నారు.
ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖ హెల్ప్ లైన్ 112 టోల్ ఫ్రీ సర్వీసు, గృహహింస, వన్ స్టాప్ సెంటర్, బాల్యవివాహాల నిరోధక చట్టం తదితర అంశాలతో కూడిన ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలన్నారు.
అలాగే పోలీస్ శాఖ ముఖ్యంగా శక్తి టీం, మహిళల భద్రత వంటి అంశాలపై ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలన్నారు. ఎస్ సి., ఎస్టి, బీసీ మైనారిటీ సంక్షేమ శాఖల రుణాలకు సంబంధించి ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయాలన్నారు. బాగా వ్యాపారం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న మహిళ వ్యాపారవేత్తలను వేదిక పైకి ఆహ్వానించి వారి విజయ గాధలను వివరించి వారికి ప్రశంసా పత్రం కూడా అందజేయాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ సత్యనారాయణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి ఎంఎన్ రాణీ, డి ఆర్ డి ఎ పిడి హరిహరనాథ్, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, మెప్మా పిడి సాయిబాబు, ఎల్ డి ఎం రవీంద్రారెడ్డి, పలువురు ఎంపీడీవోలు మునిసిపల్ కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.