కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (కేడీసీసీబీ) చైర్మన్ నెట్టెం రఘురాం బుధవారం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసి, కేడీసీసీ బ్యాంక్ పరిధిలో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పిఎసిఎస్) వాటిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు పరిపాలనా అంశాలపై పరిష్కారాన్ని కోరుతూ ముఖ్యమంత్రి వినతిపత్రం సమర్పించారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పరిధిలో పిఎసిఎస్ సంఘాల్లో సీఈఓ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న అర్హులైన ఉద్యోగులకు ఒకసారి ప్రత్యేక ప్రమోషన్లను పరిశీలించవలసిందిగా ఆయన అభ్యర్థించారు. పలు గ్రామీణ పిఎసిఎస్ సంఘాలు డైలీవేజ్ సిబ్బందిపై ఆధారపడి పనిచేస్తున్నాయని, అందువల్ల అర్హత పరీక్ష నిర్వహించి, అర్హులైన వారికి న్యాయబద్ధంగా అవకాశం కల్పించాలనే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. కేడీసీసీ బ్యాంక్ , పిఎసిఎస్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు విషయమై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసిన విధంగా వీరికి కూడా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచితే అనుభవజ్ఞులైన సిబ్బంది సేవలు మరింత కాలం అందుబాటులో ఉంటాయని తెలిపారు.
కొన్ని వేతనాలు “సస్పెన్స్ డ్యూ టు అకౌంట్” కింద నిల్వ ఉండటం వల్ల ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాటిని క్రమబద్ధీకరించేందుకు తగిన మార్గదర్శకాలు జారీ చేయవలసిందిగా ఆయన కోరారు. అదేవిధంగా, అవసరమైన విద్యార్హతలు పొందేందుకు గతంలో ఇచ్చిన గడువును మరికొంత కాలం పొడిగిస్తే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఉద్యోగులకు ఉపశమనం కలుగుతుందని, వారి ఉద్యోగ భద్రత కాపాడబడుతుందని అభ్యర్థించారు. ఈ వినతులన్నీ ఉద్యోగుల ప్రయోజనాలకే పరిమితం కాకుండా, గ్రామీణ సహకార వ్యవస్థ బలోపేతానికి, రైతులకు నిరంతర సేవలందించేందుకు దోహదపడతాయని నెట్టెం రఘురాం తెలిపారు. ముఖ్యమంత్రి నెట్టెం రఘురాం వినతిని శ్రద్ధగా విని, సంబంధిత శాఖలతో పరిశీలించి సాధ్యమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.