విలేఖరి ఉప్పందించడంతో పారిపోయిన అక్రమ తవ్వకందారులు
మచిలీపట్నం :
మచిలీపట్నం మండలంలో మడ అడవులు అక్రమ తవ్వకాలపై కృష్ణాజిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెదపట్నం, కానూరు ప్రాంతంలో మడ అడవులు తవ్వకాలపై సమాచారం అందుకున్న నాని హుటాహుటిన తవ్వకాల ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఇంతలో అక్రమ తవ్వకాదారులు తవ్వకాలను నిలిపివేసి అక్కడి నుంచి హుటా హుటిన పారిపోయారు. దీనిపై పేర్ని వెంకట్రామయ్య (నాని) జాయింట్ కలెక్టర్ నవీన్ కు తవ్వకాల పై ఫిర్యాదు చేశారు. అనంతరం పేర్ని విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఉన్న గ్రామస్థాయి నాయకులు ఎకరం సాగు చేస్తున్న రైతులను కమిషన్ల కోసం వేధిస్తున్నారు అని అన్నారు. మండలంలోని మడ అడవులను ధ్వంసం చేస్తున్నా ఆర్డీవో పట్టించుకోవడంలేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మడ అడవులను తొలగిస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్న ఆర్డీవో తీరును ఘాటుగా పేర్ని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల కోసమే పని చేయాలన్నారు. మడ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయగానే ఆయన వెంటనే స్పందించారని అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు రైతులు చెప్పే సమస్యలను సావధానంగా ఆలకించి రైతులకు సహాయపడాలన్నారు. తాను జాయింట్ కలెక్టర్ కు సమస్యను చెప్పిన వెంటనే ఆయన స్పందించిన తీరును చూసి బందరు ఆర్డిఓ నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు.
విలేఖరి పై పేర్ని విమర్శ
బందరు మండలం కానూరు లో కూటమి ప్రభుత్వానికి చెందినవారు కొంతమంది మడ అడవులను తవ్వుతున్నారని దినపత్రిక విలేఖరి తనకు సమాచారం అందించారని, తవ్వకానికి పాల్పడుతున్న వారిని తక్షణమే పట్టుకోవాలని ఆ విలేఖరి తనకు వివరించారని పేర్ని మీడియాకు తెలిపారు. తాను స్వయంగా తన పార్టీకి చెందిన వారితో కానూరు కు వెళ్ళగా అప్పటికే సదర విలేఖరి కూటమి ప్రభుత్వానికి చెందిన వారికి – పేర్ని నాని ఆకస్మక తనిఖీకి వస్తున్నారని చెప్పి ఆ కూటమి నాయకులని అక్కడి నుండి పారిపోవాలని సమాచారం అందించి ద్వంద్వ వైఖరి అవలంబించాడని, విలేకరిని దుయ్యబట్టారు. ఆ విలేఖరి వల్ల తాము సురక్షితంగా ఉండగలిగామని కూటమికి చెందిన నాయకులు చెప్పడం విశేషం!!