మచిలీపట్నంలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
SSN
- March 29, 2026
- 1 min read
[addtoany]
– నియోజకవర్గం వ్యాప్తంగా భారీ ర్యాలీలతో సంబరంలా ఏర్పాట్లు
– ప్రతి వార్డు, గ్రామంలో జెండా ఆవిష్కరణలు
– ఆత్మాభిమానం నినాదంతో ఆవిర్భవించి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం
– రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ఘనత టీడీపీదేన్న మంత్రి కొల్లు రవీంద్ర.
మచిలీపట్నం :
ఆత్మాభిమానం నినాదంతో ఆవిర్భవించి.. ఆత్మవిశ్వాసంతో తెలుగు వారిని ముందుకు నడిపిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పట్టణం మొత్తాన్ని పసుపు జెండాలతో సుందరమయంగా అలంకరించారు. ఉత్సాహభరిత వాతావరణంలో మొదట పార్టీ కార్యాలయంలో జెండా వందనం నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి బస్ స్టాండ్ సెంటర్‌లోని మహానేత ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసి, మచిలీపట్నం 10, 50, 42, 26 డివిజన్‌లలో నూతనంగా ఏర్పాటు చేసిన జెండా దిమ్మెల జెండా ఆవిష్కరించారు. ప్రతి డివిజన్‌లో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకుని.. 45వ వసంతంలోకి అడుగు పెడుతున్నందుకు అత్యంత సంతోషంగా ఉంది. 1982 మార్చి 29న పది మంది సమక్షంలో తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు తెలుగు వారి తలరాతలు మార్చే స్థాయికి ఎదిగింది. బడుగు బలహీన వర్గాల కోసం, దళిత వర్గాల కోసం చేసిన పోరాటం చారిత్రాత్మకం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే.. రైతులు, కార్మికులు, పేదలను అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో నాగలి, ఇరుసు, ఇల్లు చిహ్నంగా మార్చుకున్నారు.
తెలుగు వారు అంటే మదరాసీలుగా పిలిచి అవమానించారు. ఢిల్లీలో చీటీ రాస్తే.. ఇక్కడి ముఖ్యమంత్రి చీటీ చినిగిపోయేది. సంతకం కూడా చేతకాని వ్యక్తుల్ని ముఖ్యమంత్రులుగా కూర్చోబెట్టి.. కాంగ్రెస్ పాలకులు ఆటలాడుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల పాటు చైతన్యరథంపై రాష్ట్రమంతా తిరిగి.. అన్ని వర్గాల ప్రజల్ని కలిశారు. యువతను, మహిళల్ని ప్రత్యేకంగా ప్రోత్సహించారు. ప్రపంచంలో ఎక్కడా ఎవరూ సాధించలేని విధంగా.. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చాం. పేదలు కడుపునిండా తినాలనే లక్ష్యంతో రూ2కే కిలో బియ్యం పథకాన్ని దేశంలోనే తొలిసారిగా ఏపీలో అమలు చేశారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రజల హక్కుల్ని కాపాడారు. బడుగు బలహీన వర్గాల్లో కూడా రాజీయ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రిజర్వేషన్లు కల్పించారు. మహిళలకు ప్రత్యేక యూనివర్శిటీ ఏర్పాటుచేశారు. ఆస్తిలో హక్కులు కల్పించారు.
పార్టీకి సిద్దాంతం ప్రతి కార్యకర్తకూ చేరాలనే లక్ష్యంతో గండిపేటలో శిక్షణా శిభిరం ఏర్పాటు చేసి సుసిక్షితులైన నాయకులను సమాజానికి అందించారు. అనేక సార్లు అధికారంలోకి వచ్చాం. కొన్ని సార్లు ఓడిపోయాం. అధికారంలో ఉన్నా లేకున్నా.. తెలుగు వారి కోసమే అడుగులు వేశాం. అన్న ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మాభమనాం అంటే.. చంద్రబాబు ఆత్మవివ్వాసం అన్నారు. భవిష్యత్తును ఊహించి ప్రజల కోసం పని చేశారు. చంద్రబాబు ని అరెస్టుచేస్తే 120 దేశాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపారంటే.. వారి మనసులో మన పట్ల ఉన్న ఆరాధనా భావం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
తొలిసారి టీడీపీ అధికారంలోకి రాగానే ఇందిరాగాంధీ ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారు. అడ్డగోలుగా పదవి నుండి దించితే.. ప్రజల పోరాటంతో నెల రోజుల్లోనే మళ్లీ ఎన్టీఆర్ ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టుకున్నాం. 1994లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఒక దుష్టశక్తి కాంగ్రెస్ పార్టీలోని అరాచక శక్తులతో చేతులు కలిపి పార్టీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించినా.. చంద్రబాబు నాయక్వాన్ని ఎంచుకుని పార్టీని కాపాడుకున్నాం. అప్పటి నుండి 2004 వరకు అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించుకున్నాం. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకు లక్ష కోట్లు దోచుకున్నాడు. రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశాడు. మళ్లీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో అంతా చేశాడు.
తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏకంగా రాష్ట్రాన్ని విడగొట్టింది. కానీ కుట్రలో కాంగ్రెస్ పార్టీ బలైపోయింది తప్ప తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు. రాష్ట్ర విభజనతో కుర్చోడానికి కుర్చీ కూడా లేని స్థాయి నుండి.. ఒక్కో మెట్టు నిర్మించుకుంటూ ముందుకు అడుగేశాం. కానీ.. కులం మతం ప్రాంతం పేరుతో ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని విధ్వంసం చేశాడు. రాష్ట్రానికి జీవనాడిలా నిలిచే పోలవరం ప్రాజెక్టును కుదించాడు. ప్రశ్నించే ప్రతి నాయకుడిని అరెస్టులు చేశారు. తప్పుడు కేసులతో ఇబ్బందులు పెట్టారు. కానీ.. కార్యకర్తలు చెక్కు చెదరలేదు. ప్రజలంతా ఏకమై దుష్ట శక్తిని తొక్కి పట్టి నారతీశారు.
2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఏకంగా 94శాతం సీట్లతో అధికారంలోకి తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీలో నాయకులు, కార్యకర్తలు చేసిన త్యాగాలు చారిత్రాత్మకం. గత 44 సంవత్సరాలుగా పార్టీకి అండగా నిలుస్తున్న ప్రతి కార్యకర్తకూ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అనేక మంది కార్యకర్తల త్యాగాలతో, నాయకుల పోరాటాలతో అధికారంలోకి వచ్చాం. వారికి ఎప్పుడూ అండగా ఉంటాం. అదే సమయంలో అండగా నిలిచిన ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలనే లక్ష్యంతో అడుగులేస్తున్నాం.
గత ఐదేళ్లు రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటేనే భయపడే పరిస్థితి సృష్టించారు. కానీ నేడు.. వెళ్లిపోయిన పెట్టుబడుల్ని తిరిగి తీసుకొస్తున్నాం. పెట్టుబడి దారులకు అనుకూలమైన వాతావరణం కల్పించి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చేస్తున్నాం. విశాఖలో రూ.1.38 లక్షల కోట్ల పెట్టుబడితో స్టల్ ప్లాంట్ తీసుకొచ్చాం. గూగుల్ లాంటి ప్రఖ్యాత కంపెనీలను ఏపీకి తీసుకొస్తున్నాం. ప్రజలు, కార్యకర్తలు కూడా పెట్టుబడితో వచ్చేవారికి అనుకూలమైన పరిస్థితులు కల్పించాలి. అప్పుడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
పార్టీ స్థాపించిన సమయంలో అన్న ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలు 40 సంవత్సరాలు పార్టీని కాపాడాయి. ఇప్పుడు బూత్ స్థాయిలో, కుటుంబ సాధికార సారధులను ఏర్పాటు చేసుకుంటున్నాం. వారంతా ప్రజల్లోకి వెళ్తే.. మరో 30 సంవత్సరాలు పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మచిలీపట్నంలోని 34 పంచాయతీలు, 60వార్డుల్లోనూ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి.
యువ నాయకుడు నారా లోకేష్ కూడా తాత బాటలో, తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ.. రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. తీసుకువస్తూ తెలుగు వారు ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.
44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రతి కార్యకర్తా భాగస్వాములై తెల్లవారుజాము నుంచి పార్టీ జెండాలను ఎగరేయడం హర్షణీయం. సీనియర్స్‌ను కూడా సన్మానం చేసుకోవాల్సిన అవసరం నెలకొంది. తెలుగు జాతి ఉన్నంతవరకు, సూర్య చంద్రులు ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం పనిచేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ ఉప సభాపతి బూరగడ్డ వేదవ్యాస్, జిల్లా పార్టీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ, మోటమర్రి బాబాప్రసాద్, సీనియర్ నేత గొర్రెపాటి గోపీచంద్ తదితర నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

