[addtoany]
జిల్లాలో బాల్యవివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీ, బాలలపై లైంగిక వేధింపుల నివారణకు గ్రామ/వార్డు స్థాయి కమిటీలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి గ్రామ/వార్డు స్థాయి బాలల సంక్షేమ పరిరక్షణ కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ/వార్డు స్థాయి బాలల సంక్షేమ పరిరక్షణ కమిటీలో గ్రామ సర్పంచ్ చైర్‌పర్సన్‌గా, మహిళా పోలీస్ మెంబర్ కన్వీనర్‌గా, పంచాయతీ/వార్డు సెక్రటరీ, వీఆర్వో, స్థానిక ప్రధానోపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్త, ఏఎన్‌ఎమ్, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపారు.
ఈ కమిటీలు ప్రధానంగా జిల్లాలో బాలల సంక్షేమం, సంరక్షణ, బాల్యవివాహాల నివారణ, పిల్లలపై లైంగిక వేధింపుల అరికట్టడంలో మరింత చురుకుగా పనిచేయాలన్నారు. ఈ విషయంలో మహిళా పోలీస్ సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
జిల్లాలో కొన్నిచోట్ల బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇది సమన్వయ లోపం కారణంగా జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇకముందు ఒక్క బాల్యవివాహం కూడా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఉల్లంఘనలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అలాగే జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు కూడా నమోదవుతున్నాయని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యమైన పరిణామం కాదని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే దుష్ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు, విద్యాభ్యాసం మధ్యలో నిలిచిపోవడం వంటి ప్రతికూల ఫలితాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో బాల్యవివాహాలు, పిల్లలపై లైంగిక వేధింపుల నివారణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పిల్లలకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిస్తున్నామని, అలాగే ఎర్లీ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే అనర్ధాలు గురించి వివరిస్తున్నామని చెప్పారు.
అదేవిధంగా పిల్లల సంరక్షణకు సంబంధించిన పోక్సో చట్టం, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలపై కూడా చైతన్యం అనే కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే కళాశాలల్లో ర్యాగింగ్ నివారణపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రతి గ్రామం, వార్డులో బాలల రక్షణ, సంక్షేమం, భద్రత కోసం సంబంధిత కమిటీలు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, జెడ్పి సీఈవో కే కన్నమనాయుడు, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, విద్య, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, సచివాలయాల మహిళా పోలీసులు, వీఆర్వోలు, ఏఎన్ఎంలు, అంగన్వాడి కార్యకర్తలు, ఉపాధ్యాయులు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

