మచిలీపట్నం:
జిల్లాలోని రైతుల నుండి రబి సీజన్ కాలంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా ధాన్యం కొనుగోలు చేయుటకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ తో కలసి 2025-26 రబి సీజన్ కు గాను జిల్లా ధాన్యం సేకరణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం జిల్లాలో 54,678 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు.
జిల్లాలోని రైతులందరూ వారి ధాన్యాన్ని పూర్తిగా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఆరబెట్టుకొని రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర పొందే విధంగా కృషి చేయాలన్నారు.
ప్రభుత్వం కల్పించిన వాట్సాప్ షెడ్యూలింగ్ సదుపాయాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ధాన్యం సేకరణకు అవసరమైన కేంద్రాల ఏర్పాటు, సాంకేతిక సిబ్బంది నియామకంతో పాటుగా వారికి ధాన్యం సేకరణ పై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.
జిల్లాలోని రైతులందరికీ ధాన్యం సేకరణ ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ రైతులకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ధర కల్పించడంతోపాటు గోనే సంచులు, హమాలీలు, రవాణా సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటుచేసి రైతులకు ఎటువంటి సమస్యలు రాకుండా సకాలంలో సక్రమమైన అత్యుత్తమ సేవలు అందించాలన్నారు.
ధాన్యం సేకరణకు ఉపయోగించే వాహనాలన్నింటికీ ముందుగానే జిపిఎస్ పరికరాలను అమర్చాలని సూచించారు.
ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ డిఎం శివరాం ప్రసాద్, డి.ఎస్.ఓ మోహన్ బాబు, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, భారత ఆహార సంస్థ డివిజనల్ మేనేజర్ సురేష్, డిసిఓ చంద్రశేఖర్, ఆర్టిఓ ఎన్ యూఎన్ఎస్ శ్రీనివాసరావు, మార్కెటింగ్ ఎడి నిత్యానందం, తూనికలు కొలతలశాఖ నియంత్రణ అధికారి ఈశ్వరయ్య, డిసీఎంఎస్ వ్యాపార మేనేజర్ శ్రీధర్, నారాయణ సేవ సమితి సీఈవో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.