[addtoany]
ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ప్రయోజకులైన ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు!
ఎవరి పిల్లలైనా, వారు ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానంలోకి ఎదగాలని కోరుకోవడం సహజం. కూలీ పిల్లలైన, కోటీశ్వరుల పిల్లలైనా వారి బిడ్డలకు విద్యే పునాది. ప్రస్తుత రోజుల్లో కూలి పనులు చేసుకుంటూ కూడా తమ బిడ్డల్ని కాన్వెంట్లకు పంపుతూ… వారు ఉన్నత స్థానానికి ఎదగాలని ఆశించే వాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చకుండా ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపిస్తున్నారు. నిరుపేదలైన వారు కూడా తమ పిల్లలు ఉన్నత స్థితికి ఎదగాలనే భ్రమలో వేలకు వేలు కాన్వెంట్ ఫీజులకు ధారపోస్తున్నారు. ఇంగ్లీషు భాష పట్ల మక్కువతో, ”మమ్మీ” “డాడీ” కల్చర్ కి పట్టం కడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ బిడ్డల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చి, వారు ఉన్నత స్థితికి ఎదిగేలాగా ప్రోత్సాహాన్ని అందించిన ఈ తల్లిదండ్రులు అభినందనీయులు.
భార్యాభర్తలిరువురు ప్రభుత్వ ఉపాధ్యాయులే
ఈ భార్యాభర్తలు ఇరువురూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులే. దాదాపు 30 సంవత్సరాలకి పైగా ప్రభుత్వ పాఠశాలలోనే పనిచేస్తున్నారు. వీరు ఏ పాఠశాలలో పనిచేస్తే ఆ పాఠశాలలోనే వీరి పిల్లలను చేర్చడం వీరి నైజం. వీరి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చి ఉన్నత స్థితికి తీసుకొచ్చారు.
భర్త గుడివాడ శ్రీహరి పెడన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా, భార్య శరత్ రమణి గూడూరు మండలం పోసిన వారి పాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. వీరికి ఇరువురు సంతానం.
తెలుగు మీడియంలోనే బిడ్డల ప్రస్థానం
వీరి అబ్బాయి గుడివాడ ప్రశాంత్ ఐదో తరగతి వరకు కోసూరు ప్రభుత్వ పాఠశాలలోనూ, ఆరవ తరగతి నవోదయ పాఠశాలలోనూ, ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రభుత్వ రాంజీ ఉన్నత పాఠశాల మచిలీపట్నం నందు, ఇంటర్మీడియట్ ఆర్కే కాలేజీలో తదుపరి జేఎన్టీయూ హైదరాబాద్ లో సివిల్ ఇంజనీరింగ్ చేసి రెండు సంవత్సరములు పైగా టిసిఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసి అమెరికాలో ఎమ్మెస్ చేసి ప్రిన్సిపల్ డేటా సైంటిస్ట్ గా పెన్సిల్వేనియాలో అత్యున్నత స్థాయిలో పని చేస్తున్నాడు.
అలాగే వీరి అమ్మాయి గుడివాడ శ్రీ రమ్య ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం లోనే చదివి ప్రస్తుతం అమెరికన్ కంపెనీ అట్లాంటా, హైదరాబాదు నందు పనిచేస్తోంది.
శ్రీరమ్య ఒకటి, రెండు తరగతులు రాంజీ ఉన్నత పాఠశాలలోనూ, మూడు, నాలుగు తరగతులు గూడూరు మండలం ఈదుముడి ప్రాథమికోన్నత పాఠశాలలోనూ, ఐదో తరగతి స్థానిక శిశువిద్య మందిరంలోను, ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు రుస్తుంబాదా గర్ల్స్ హై స్కూల్ నందు చదివి, పదవ తరగతిలో 10కి 10 జిపిఎ సాధించింది. తదుపరి ట్రిపుల్ ఐటీ నూజివీడులో చదివి 9.1 జిపిఏ తో మంచి ఫలితం సాధించి, క్యాంపస్ సెలక్షన్లో 45,000/- రూపాయల జీతంతో ఉద్యోగ ప్రస్థానంలో తొలి అడుగులు వేసింది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అమెరికన్ టెలిగ్రాఫ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ హైదరాబాదులో అత్యంత ప్రతిభ చూపి 2023 అక్టోబర్ లో ఫుల్ టైం జాబు సాధించింది. శ్రీరమ్య కి ట్రావెలింగ్ అంటే అభిరుచి. కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని, కొంగొత్త విషయాలు కనిపెట్టాలని శ్రీ రమ్య తపన.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు
తమ బిడ్డలిద్దరినీ ప్రభుత్వ పాఠశాలలో చదివించి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఈ తల్లిదండ్రులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు.
ఈ సందర్భంగా మీడియా ఈ దంపతులను పలకరించగా, శరత్ రమణి మాట్లాడుతూ తాము మొదటి నుండి తమ బిడ్డల్ని తాము పని చేసిన పాఠశాలలోనే చదివించామని, ముఖ్యంగా పదవ తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదివించామన్నారు. పాఠశాల అనంతరం ఏ విధమైన ట్యూషన్లు పెట్టకుండా తమ బిడ్డల పర్యవేక్షణ బాధ్యతలు తామే చూసుకున్నామన్నారు. అందరు పిల్లలతో సమానంగా తమ పిల్లలు కూడా చదవాలనే సదుద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చామన్నారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా తమ పిల్లల్ని పెంచాం అన్నారు. తమ పిల్లలు కూడా సక్రమంగా చదివి ఉన్నత మార్గంలో స్థిరపడడం తమకు ఆనందదాయకంగా ఉందని మండవ వెంకట హిమ శరత్ రమణి అన్నారు.
తెలుగు మీడియంలో చదివిన ఈ బిడ్డలు నిజ్జంగా రత్నాలై ప్రకాశించారు. ఇది గర్వకారణమే కదా! ఏ మీడియంలో చదివాం? అనేది ప్రధానం కాదు. మాతృభాషతో పాటు,ఇంగ్లీష్ భాషను కూడా నేర్చుకుంటూ, ఉన్నత స్థానానికి ఎదగొచ్చని వీరి బిడ్డలు నిరూపించారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ దంపతుల కృషి అజరామరం. కొంతమంది బిడ్డలు ఇంగ్లీష్ కాన్వెంట్ లో చదివినా సరైన స్థితిలో రాణించలేరు. బిడ్డలు సక్రమంగా రాణించాలి అంటే తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల పర్యవేక్షణ కూడా అత్యంత అవసరం. ముఖ్యంగా నైతిక విలువలు వ్యక్తిత్వ వికాసం ఆవశ్యకం.
నేడు ప్రభుత్వ పాఠశాలలలో ఎందరో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారు. ప్రభుత్వం కూడా విద్యార్థినీ, విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం, యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు తదితరాలను ఉచితంగా అందిస్తూ వారి భవితకు బాటలు వేస్తోంది.
పిల్లల భవిష్యత్తుకు ప్రైవేటు పాఠశాలలే పరమావధి అని భావించే విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రభుత్వ పాఠశాలలు సైతం పిల్లలను ప్రగతి మార్గంలో నడిపిస్తాయి అని నిరూపించిన ఈ ఆదర్శ తల్లిదండ్రులు అందరికీ నిదర్శనంగా నిలిచారు.
నందం రామారావు
మచిలీపట్నం

