దొమ్మేటి వెంకటరెడ్డి స్వాతంత్ర్య సంగ్రామంలో దేశం కోసం పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త, విద్యా వేత్త అని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు. సోమవారం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో స్వాతంత్ర్య సమరయోధులు దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి 1853 సంవత్సరం మార్చి 23వ తేదీన తూర్పుగోదావరి జిల్లా బోధనకుర్రు గ్రామంలో జన్మించారన్నారు. ఆనాడు శెట్టి బలిజలు వ్యవసాయ కూలీలుగా, కల్లుగీత కార్మికులుగా జీవనం సాగిస్తూ ఎన్నో ఇబ్బందులకు గురయ్యే వారన్నారు. శెట్టిబలిజ సోదరులందరినీ సమీకరించి ఒక సంక్షేమ సంఘం స్థాపించారన్నారు. ఈ సంఘం ద్వారా ప్రాథమిక పాఠశాలలు, గ్రంధాలయాలు, రాత్రి పాఠశాలలు నెలకొల్పి వయోజన విద్యకు ఎంతగానో కృషి చేశారన్నారు. అంతేకాకుండా శెట్టిబలిజలతో ఓ సైన్యం తయారుచేసి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడారన్నారు.
ఆయన జయంతి రోజున ఆయన చేసిన సమాజ సేవా కార్యక్రమాలను మననం చేసుకోవడం మన కర్తవ్యం అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో చంద్రశేఖర రావు, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, మెప్మా పిడి సాయిబాబు, డిఎస్పి లు శ్రీనివాసరావు, ధర్మేంద్ర పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.