మచిలీపట్నం, 10 మార్చి 2026, SSN:
పెండింగ్ లో ఉన్న రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులను సత్వరమే పరిష్కరించడమే జాతీయ లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశం అని కృష్ణా జిల్లా జడ్జి జి. గోపి అన్నారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయ సేవాసదనము లో న్యాయమూర్తుల, న్యాయవాదుల సంయుక్త సమావేశానికి జిల్లా జడ్జి జి.గోపి ముఖ్యఅతిథిగా విచ్చేశారు
మార్చి 14వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నందిగామ, నూజివీడు తో సహా అన్ని న్యాయస్థానాలలో లోక్ ఆదాలత్ బెంచ్ లు ఏర్పాటు చేసినట్లు జిల్లా జడ్జి వివరించారు. కేసులు సత్వర పరిష్కారానికి న్యాయవాదులు, పోలీసులు, ఇతర అధికారులు సహకరించాలని ఆయన తెలియజేశారు. సత్వర న్యాయం పొందడం ద్వారా ప్రజలకు న్యాయవ్యవస్థ పై మరింత నమ్మకం పెరుగుతుందని అన్నారు.
ఇటీవల భోపాల్ లో జరిగిన జాతీయ స్థాయి న్యాయమూర్తుల సమావేశంలో పాల్గొన్న జి. గోపి సమావేశం వివరాలను తెలియజేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల కృష్ణా జిల్లాకు విచ్చేసిన సందర్భంగా మీడియేషన్ పై ప్రత్యేక సదస్సు నిర్వహించి కేసులు పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన విషయం జిల్లా జడ్జి తెలియ చేశారు.
గత లోక్ ఆదాలత్ లో రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో ఉన్న కృష్ణాజిల్లాను మొదటి స్థానం స్థాయికి తీసుకురావాలని అందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కక్షిదారులు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని అన్నారు. లోక ఆదాలత్ లో పరిష్కారం చేసుకున్న సివిల్ ధావాలకు కోర్టు ఫీజు తిరిగి కక్షిదారులకు చెల్లిస్తారని అందుకోసం కృష్ణా జిల్లా కలెక్టర్మ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తో కూడా మాట్లాడినట్లు జిల్లా జడ్జి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ రామకృష్ణయ్య, కృష్ణా జిల్లా అదనపు జిల్లా జడ్జీలు జీ. వెంకటేశ్వర్లు, బి.బాబు నాయక్ ఎస్. సుజాత, బార్ అసోసియేషన్ అధ్యక్షులు డి. పోతురాజు, పలువురు న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.