సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 35 ఫిర్యాదులు అందాయి. చట్ట పరిధిలో విచారణ జరిపి పరిష్కారం అందించేలా కృషి చేస్తానని జిల్లా ఎస్పీ వి .విద్యాసాగర్ నాయుడు అన్నారు.
హనుమాన్ జంక్షన్ నుండి హరి అనే వ్యక్తి వచ్చి తన స్నేహితునికి వ్యక్తిగత అవసరాల నిమిత్తం 3 లక్షలు అప్పుగా ఇవ్వడం జరిగిందని, తీసుకొని రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా అడిగినందుకు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి శారీరక దాడికి పాల్పడ్డారని రక్షణ కల్పించి న్యాయం చేయమని ఫిర్యాదు చేశారు.
పామర్రు నుండి వీరయ్య అనే వృద్ధుడు వచ్చి తన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిని తన దగ్గర బంధువులు ఫోర్జరీ చేసి వారి పేర రాయించుకోవాలని చూస్తున్నారని అడిగినందుకు ఆకారణంగా దాడి చేస్తూ హింసిస్తున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు చేశారు.
తోట్లవల్లూరు నుండి లత అనే వివాహిత వచ్చి తనకు వివాహం జరిగి రెండు సంవత్సరాలు కాగా, ఇంతవరకు పిల్లలు పుట్టలేదనే కారణంతో తన భర్త అత్తింటివారు బలవంతంగా విడాకులు ఇవ్వాలని చూస్తున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు చేశారు.